
2 నిమిషాల్లో గోల్డ్ లోన్స్.. నో చాన్స్
రెండు నిమిషాల్లో గోల్డ్ లోన్స్... అధిక మొత్తానికి రుణం అంటూ ఊదొరగొట్టిన గోల్డ్‌లోన్స్ ప్రచార ప్రకటనలకు అడ్డుకట్ట పడింది. గోల్డ్‌లోన్స్ మంజూరుపై ఆర్‌బీఐ నిబంధనలకు కఠినతరం చేసింది. బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ఒడిదుడుకుల మధ్య కదులుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా గోల్డ్‌లోన్స్‌పై ఆంక్షలను పెంచింది. రెండు మూడు నిమిషాల్లోనే బంగారం ఆభరణాలపై రుణాలంటూ ఇచ్చే ప్రకటనలను తక్షణం నిలిపేయాల్సిందిగా ఆదేశించింది. అంతేకాదు రుణం ఇచ్చే విలువను కూడా భారీగా తగ్గించేసింది.
60 శాతం దాటకూడదు
గరిష్ట స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలితే గోల్డ్ లోన్స్ సంస్థలు మూసుకుపోయే పరిస్థితి ఉండటంతో రుణ విలువపై పరిమితులు విధించింది. బంగారం ఆభరణాలపై రుణాలను ఇచ్చే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) బం గారం విలువలో 60% మించి రుణం మంజూరు చేయడానికి వీలు లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అంటే లక్ష రూపాయల విలువైన ఆభరణాలను తనఖా పెడితే గరిష్టంగా రూ.60,000 మించి రుణం వచ్చే పరిస్థితి లేదు. అంతేకాదు ఒక వ్యక్తి 20 గ్రాములు మించి తనఖా పెడితే ఆ ఆభరణాలు తనవే అని నిరూపించే పత్రాలను చూపించాల్సి ఉంటుంది. గతంలో కేవలం ఈ ఆభరణాలు నావే అని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే వారు. కాని ఇప్పుడు కంపెనీలు ఆ ఆభరణాలను గురించి పూర్తి వివరాలను పరిశీలించి, వాటికి సంబంధించి రికార్డులను తప్పకుండా నిర్వహించాలి.
చెక్ తప్పనిసరి
ఇచ్చే రుణం విలువ లక్ష రూపాయలు దాటితే నగదు రూపంలో చెల్లించడానికి వీలు లేదు. ఆ మొత్తం చెక్ రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఎంత మొత్తమైనా సరే నగదు రూపంలో తీసుకోవడానికి వెసులుబాటు ఉండేది. దొంగ బంగారం, నల్లధనం వంటి వాటిని అరికట్టడానికి ఈ నిబంధనలను ఆర్‌బీఐ ప్రవేశపెట్టింది.
పాన్ ఉండాల్సిందే..
రుణ విలువ ఐదు లక్షలు దాటితే తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డు వివరాలు లేకుండా రూ.5 లక్షలకు మించి రుణాలను ఇవ్వరాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రుణం చెల్లించకపోవడంతో విఫలమైన వారి ఆభరణాలను వేలం వేసే విషయంలో కూడా మరింత పారదర్శకత ఉండాలని, వీటికి సంబంధించిన వివరాలను వార్షిక నివేదికలో పేర్కొనాలని సూచించింది. వేలం వేసేటప్పుడు నిర్ణయించే రిజర్వ్ ప్రైస్ 30 రోజుల సగటు బంగారం ధరలో(22 క్యారెట్లు) 85 శాతం లోపే ఉండాలి.