పసలేని బడ్జెట్ | No new schemes in TN interim Budget | Sakshi
Sakshi News home page

పసలేని బడ్జెట్

Published Wed, Feb 17 2016 3:11 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM

పసలేని బడ్జెట్ - Sakshi

పసలేని బడ్జెట్

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పసలేని ప్రసంగంతో ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం మధ్యంతర బడ్జెట్‌లోని అంశాలను మంగళవారం అసెంబ్లీ ముందు ఉంచారు.
కొత్త ప్రకటనలు లేకుండా, ఎలాంటి రాయితీలు ప్రకటించకుండా, ఆయా శాఖల వారీగా  పనులకు అంతంత మాత్రపు  కేటాయింపులతో సరి పెడుతూ బడ్జెట్‌ను దాఖలు చేశారు.
ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు బహిష్కరించాయి.

 
* కొత్త ప్రకటనల్లేని బడ్జెట్
* 2,47,031 కోట్లకు చేరనున్న అప్పు
* లోటు 9,154 కోట్లు
* మహామహంకు రూ.135 కోట్లు
* ప్రతి పక్షాల బహిష్కరణ
* అదో చిత్తు పేపర్ అన్న కరుణ

సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్థిక మంత్రి పన్నీరు మధ్యంతర బడ్జెట్ ద్వారా కొత్త ప్రకటల్ని అధికార పక్షం చేయొచ్చన్న ఎదురు చూపులు పెరిగిన విషయం తెలిసిందే. అయితే, కొత్త ప్రకటనల్లేవు, కేటాయింపులు అంతంత మాత్రమేనని చాటుతూ పసలే ని అంశాలతో సభలో మధ్యంతర బడ్జెట్‌ను దాఖ లు చేసి ప్రతి పక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆర్థిక మంత్రికి ఏర్పడిందని చెప్పవచ్చు. ఉదయం బడ్జెట్ సూట్ కేసుతో సీఎం జయలలిత ఆశీస్సుల్ని పన్నీరు అందుకున్నారు.

ఆమె వెంట అసెంబ్లీలో అడుగు పెట్టి, బడ్జెట్ ప్రసంగాన్ని అందుకునే యత్నం చేశారు. ఇంతలో ప్రతి పక్షాలు రాష్ర్టంలో సాగుతున్న ఉద్యోగుల నిరసనల హోరు, అత్తికడవు - అవినాశి తాగునీటి పథకం, చేనేత కార్మికుల సమ్మె, గెయిల్ గ్యాస్, డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ రద్దు వ్యవహారాలను ఎత్తి చూపుతూ స్పీకర్ ధనపాల్‌ను నిలదీయడానికి సిద్ధమయ్యారు. బడ్జెట్ ప్రతిలో అందుకు తగ్గ ప్రకటనల్లేని దృష్ట్యా, పన్నీరు ప్రసంగాన్ని బహిష్కరిస్తూ , ఒకరి తర్వాత మరొకరు వాకౌట్ల పర్వం అందుకున్నారు.

ప్రతి పక్షాల వాకౌట్‌తో తనకేంటి అన్నట్టుగా బడ్జెట్ ప్రసంగాన్ని పన్నీరు అందుకున్నారు. 2011 నుంచి తమ హయంలో సాగిన ప్రగతి, ఘనతను ఎత్తి చుపుతూ , ఇప్పటి వరకు ఆయా పథకాలకు శాఖల వారిగా  జరిగిన కేటాయింపులు, వెచ్చించిన నిధుల చిట్టాను వివరించారు. మధ్య మధ్యలో.. తమ అమ్మ జయలలిత ఘనతను చాటే విధంగా వ్యాఖ్యలు సంధిస్తూ కొత్త ప్రకటనల్లేవు..కేవలం అంతంత మాత్రపు  కేటాయింపులే అని చాటుకున్నారు.
 
అప్పుల్లో రాష్ర్టం : అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో లక్ష కోట్ల మేరకు ఉన్న అప్పు, ఈ ఆర్థిక సంవత్సరం చివరికి  2,47,031 కోట్లకు చేరనుంది. ఆదాయ వ్యయాల గురించి పన్నీరు వివరిస్తూ, ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం 1,52,004 కోట్లు అని, ఖర్చులు 1,61,159 కోట్లుగా పేర్కొన్నారు. లోటు 9, 154 కోట్లుగా సూచించారు.
 
కేటాయింపులు :  కుంభకోణం వేదికగా జరగుతున్న దక్షిణాది కుంభమేళ మహామహంకు రూ. 135 కోట్లను కేటాయిస్తూ బడ్జెట్‌లో పన్నీరు ప్రకటించారు. ఇక, చెన్నైలో సాగుతున్న మెట్రో రైలు పనులకు రూ. 1032 కోట్లను, హోం శాఖకు రూ. 6,099 కోట్లను కేటాయించారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల మహానాడుతో రాష్ట్రంలోకి 2.42 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేస్తూ, ఉచిత పథకాలు ఏ మేరకు లబ్ధిదారులకు దరి చేరాయో వివరించారు. విద్యార్థులకు  సైకిళ్లు , ల్యాప్ టాప్‌ల కొనుగోలుకు రూ. 12,475 కోట్లను కేటాయించినట్టు, ఉచిత దోవతి, చీరల పథకానికి రూ. 495 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు.
 
అవినాశి - అత్తి కడవు : అవినాశి - అత్తికడవు తాగు నీటి పథకం కోసం దీక్ష సాగుతున్న విషయం తెలిసిందే. అక్కడి ప్రజలకు కంటి తడుపు చర్యగా బడ్జెట్ ద్వారా ‘పన్నీరు’ చల్లే యత్నం చేశారు. యూపీఏ పుణ్యమా ఆ పథకానికి ఆమోదం లభించలేదంటూ నిందల్ని గత కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టేశారు. ఆ పథకంలో మార్పులు చేర్పులతో చేపట్టేందుకు సీఎం జయలలిత ఆమోదం తెలియజేశారని, అందుకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయని ప్రకటించారు. అలాగే, ఆమోద ముద్ర కోసం కేంద్రానికి నివేదికను పంపడమే కాకుండా, ఆ పథకం అమలుకు తగ్గ ప్రాథమిక పనులు చేపట్టబోతున్నామని హామీ ఇచ్చారు.
 
నాలుగు రోజులే సభ : బడ్జెట్ దాఖలు అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సభ నాలుగు రోజుల పాటుగా నిర్వహించేందుకు నిర్ణయించారు. 17,18,19 తేదిల్లో  బడ్జెట్ కేటాయింపులపై సమీక్ష, చర్చ జరగనుంది. 20వ తేదీ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు, ముసాయిదాల ఆమోదం సాగనుంది.
 
పసలేని బడ్జెట్ ...చిత్తు పేపర్ : పన్నీరు సెల్వం మధ్యంతర బడ్జెట్‌పై ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డాయి. సభ నుంచి బయటకు వచ్చిన డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలతో హోరెత్తిస్తుంటే, వారికి భరోసా ఇవ్వకుండా ఎలాంటి ప్రకటనలు చేయక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలకు ప్రయోజనం లేని బడ్జెట్ కావడంతో బహిష్కరించామని వ్యాఖ్యానించారు.

డీఎండీకే విప్ చంద్రకుమార్ మాట్లాడుతూ, అత్తి కడవు- అవినాశి పథకం కోసం ఆమరణ దీక్ష సాగుతుంటే, స్పష్టమైన హామీ ఇవ్వకుండా, కంటి తడుపు చర్యగా వ్యవహరించారని మండిపడ్డారు. ప్రజల మీద ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదు అని  ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్తి కడవు - అవినాశి నిరసనల్ని ఎత్తి చుపుతూ సీపీఎం నేత సౌందరరాజన్ వ్యాఖ్యలు చేస్తూ, బడ్జెట్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదని వ్యాఖ్యానించారు. సీపీఐ నేత ఆర్ముగం స్పందిస్తూ, గెయిల్ గ్యాస్‌ను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండి పడ్డారు.

సుప్రీం కోర్టులో పునస్సమీక్ష అని వ్యాఖ్యానించిన ప్రభుత్వం, బడ్జెట్‌లో ఆ అంశాన్ని పొందు పరచక పోవడం బట్టి చూస్తే, అన్నదాతల మీద చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. పుదియ తమిళగం కృష్ణ స్వామి మాట్లాడుతూ డీఎండీకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారంలో కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించే రీతిలో వ్యవహరిస్తున్నారని, ప్రజా స్వామ్యాన్ని కుని చేస్తున్నారని మండి పడ్డారు.

డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఓ ప్రకటనలో ఈ బడ్జెట్ ఓ చిత్తు పేపర్‌గా అభివర్ణించారు. ఎండీఎంకే నేత వైగో పేర్కొంటూ, నిరంతరంగా ప్రజలు తనను సాగనంపుతున్నారన్న విషయాన్ని సీఎం జయలలిత పరిగణలోకి తీసుకుని ఉన్నట్టున్నారని, అందుకే బడ్జెట్‌ను పస లేకుండా చేశారని విమర్శించారు. పీఎంకే నేత రాందాసు పేర్కొంటూ,  ఐదేళ్ల ఘనత రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమేనా..? అని ప్రశ్నించారు.

ఇక, అవినాశి - అత్తి కడవు కోసం దీక్ష చేస్తున్న నిరసన కారులు స్పందిస్తూ, తాజాగా చేసిన ప్రకటననే గతంలో కూడాచేశారని గుర్తు చేశారు. తాజా ప్రకటనను అంగీకరించే ప్రసక్తే లేదు అని, ఇదే అంశాన్ని ప్రభుత్వ గెజిట్‌లో అధికార పూర్వకంగా ప్రకటిస్తే దీక్ష విరమిస్తామని ప్రకటించి, పన్నీరు బడ్జెట్‌లో అత్తి కడవు ప్రకటనను తిరస్కరించారు.
 
సభకు ఆరుగురు ఎమ్మెల్యేలు: రెండు సమావేశాలు సస్పెన్షన్‌కు గురైన డీఎండీకేకు చెందిన ఆరుగురు సభ్యులు మంగళవారం సభలో అడుగు పెట్టారు. అసెంబ్లీలో అడుగు పెట్టి, డీఎండికే సభ్యులతో కలసి పన్నీరు ప్రసంగాన్ని బహిష్కరించారు. ఇక, వీరి సస్పెన్షన్ తీర్పు రద్దును పునస్సమీక్షించాలంటూ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement