
'సస్పెన్షన్ ఎత్తివేతపై నన్ను ఎవరూ కలవలేదు'
లోక్ సభలో సస్పెన్షన్ గురైన కాంగ్రెస్ ఎంపీల వ్యవహారంపై తనను ఎవరూ కలవలేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ:లోక్ సభలో సస్పెన్షన్ కు గురైన కాంగ్రెస్ ఎంపీల వ్యవహారంపై తనను ఎవరూ కలవలేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. ఆ ఎంపీలపై సస్పెన్సన్ ను ఎత్తివేసే అంశం ఇప్పటివరకూ తన దృష్టికి రాలేదన్నారు.
అసలు ఆ అంశంపై ఏ ఒక్కరూ తనను కలవడం కానీ, ఆ విషయాన్ని ప్రస్తావించడం కానీ జరగనేలేదని తెలిపారు. దీనిపై తాను సుమోటోగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేనని పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ సుమిత్ర మహాజన్ పేర్కొన్నారు.
కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులను పదవుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభలో ఆందోళన కొనసాగించిన ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల్లో 25 మందిని సోమవారం స్పీకర్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు.