నాన్న నుంచి నన్నెవరూ వీడదీయలేరు: అఖిలేశ్
లక్నో: తన కన్నతండ్రి ములాయంసింగ్ యాదవ్ నుంచి తనను ఎవరూ వేరు చేయలేరని, తమ తండ్రి కొడుకుల బంధాన్ని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. జాతీయ కార్యవర్గ సదస్సులో ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన సందర్భంగా అఖిలేశ్ ఉద్వేగంగా స్పందించారు.
పార్టీ శ్రేయస్సు, భవిష్యత్తు దృష్ట్యా తాను పార్టీ పగ్గాలు చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికీ తమకు ములాయంపై పూర్తి విశ్వాసం ఉందని, ఆయనకు తన హృదయంలో మహోన్నతమైన స్థానం ఉందని అన్నారు. తమ పార్టీ ప్రభుత్వం మళ్లీ ఏర్పడితే.. అందరికన్నా ఎక్కువగా సంతోషపడేది ములాయంమేనని పేర్కొన్నారు. యువత, రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని తన ప్రభుత్వం పనిచేసిందని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
'నేతాజీ నా తండ్రి. నేను ఆయన కొడుకును. మా మధ్య కుట్ర పన్ని.. మమ్మల్ని ఎవరూ వేరుచేయలేరు. మా మధ్య కుట్రపన్ని విభేదాలు సృష్టించడానికి ఎవరు ప్రయత్నించినా ఊరుకోను' అని అఖిలేశ్ స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారిపైనే నా పోరాటమని అన్నారు.