ఈ సమావేశాల్లో సాధ్యం కాదు: అజిత్‌సింగ్
బడ్జెట్ సమావేశాల్లోనే టీ బిల్లు: కేంద్రమంత్రి అజిత్‌సింగ్
అజిత్‌సింగ్‌తో టీ జేఏసీ నేతల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం సాధ్యం కాదని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) అధినేత, కేంద్రమంత్రి అజిత్‌సింగ్ స్పష్టం చేశారు. ప్రత్యేక లేదా బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు వస్తుందని చెప్పారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్, దేవిప్రసాద్, టీఆర్‌ఎల్‌డీ నేత దిలీప్‌కుమార్ తదితరులు గురువారమిక్కడ అజిత్‌సింగ్‌ను కలిశారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందిగా, ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయనకు విన్నవించారు.
భేటీ అనంతరం టీజేఏసీ, టీఆర్‌ఎల్‌డీ నేతలతో కలసి అజిత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణపై మీడియా కథనాలను ప్రస్తావిస్తూ.. తెలంగాణ, రాయలసీమలో సాంస్కృతిక వైరుధ్యం ఉందన్నారు. 50 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం ఆందోళనలు కొనసాగుతుండగా, ఇప్పటి వరకు రాయల తెలంగాణ ప్రశ్న తలెత్తలేదన్నారు. అయితే జీవోఎం వాదనలేమిటనేది కేబినెట్ భేటీలో తెలుస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని పార్టీపరంగానూ, తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పారు.
‘‘యూపీ నుంచి ఉత్తరాఖండ్‌ను విభజించినప్పుడు కొన్ని జిల్లాలను కలిపే విషయంలో పదేళ్ల వరకు ఉద్యమం కొనసాగింది. అయినప్పటికీ రాష్ట్రం ఏర్పాటైంది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యేప్పుడు సరిహద్దుల విషయంలో పరస్పర అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. కానీ ఇక్కడ పది జిల్లాల ప్రజల్లో తెలంగాణపై ఏకాభిప్రాయం ఉంది’’ అని చెప్పారు. యూపీఏ పాలనలో టీ బిల్లు ఆమోదం అవుతుందంటారా అని అడిగిన ప్రశ్నకు.. ‘‘యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి చిత్తశుద్ధితో ఉంది. తెలంగాణ ఏర్పాటనేది జరిగితే యూపీఏ-2లోనే అవుతుంది. అది కూడా ఎన్నికల ముందే జరుగుతుంది. ఎన్నికల తర్వాత విభజన జరిగితే యూపీఏ-2లో జరగదు కదా..?’’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ డిమాండ్ వెనుక కారణాలను అజిత్‌సింగ్ అడిగి తెలుసుకున్నారని, కేబినెట్‌లో చర్చకు వచ్చినప్పుడు 10 జిల్లాల తెలంగాణకు ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.