నోకియా ఫోన్లు లీక్...
2016 చివరిలో మార్కెట్లోకి ప్రవేశించబోతున్న రెండు నోకియా ఆండ్రాయిడ్ నోగట్ స్మార్ట్ ఫోన్లు లీక్ అయ్యాయి. ఫిన్ లాండ్ హెచ్ఎమ్డీ గ్లోబల్ వీటిని తయారుచేస్తుందని లీక్ వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్లు 5.2 అంగుళాలు, 5.5 అంగుళాలుగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఐపీ68 సర్టిఫికేషన్ తో, సమర్థవంతమైన వాటర్, డస్ట్ రెసిస్టెంట్ పవర్ తో ఇవి మార్కెట్లోకి దర్శనమివ్వనున్నాయట.
గిజ్మో చైనా రిపోర్టు ప్రకారం, స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్ తో, తాజాగా గూగుల్ నామకరణం చేసిన ఆండ్రాయిడ్ వెర్షన్ 7.0 నోగట్ ఆధారితంగా ఇవి రూపొందుతున్నాయని తెలుస్తోంది. పూర్తి మెటల్ బాడీ, ఓలెడ్ స్క్రీన్, ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఇవన్నీ లీకేజీలోని ఈ ఫోన్ల ప్రత్యేకతలు. ఇప్పటివరకూ వచ్చిన అన్ని సెన్సార్స్ స్మార్ట్ ఫోన్లలో ఈ రెండే చాలా సెన్సిటివ్ గా ఉండబోతున్నాయట.
నోకియా పవర్ యూజర్లు ఈ ఫోన్లను అధికారికంగా 2016 లో చివరిలో వినియోగదారుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ లాంచింగ్ తేదీ ఫోన్ల టెస్టింగ్, డెవలప్ మెంట్ మీద ఆధారపడి ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ టెస్టింగ్ ఆలస్యమైతే 2017 మొదటి త్రైమాసికంలోనైనా తీసుకురావొచ్చని భావిస్తున్నాయి.
కొత్తగా ఏర్పాటుచేసిన హెచ్ ఎమ్డీ గ్లోబల్ కు ఎక్స్ క్లూజివ్ లైసెన్స్ ను క్రియేట్ చేశామని, వచ్చే 10ఏళ్లలో నోకియా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను, టాబ్లెట్లను విక్రయిస్తామని కంపెనీ గతేడాది మేలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్, శాంసంగ్ లు హవా లేకముందు మొబైల్ మార్కెట్లో నోకియా ప్రపంచంలోనే టాప్ మొబైల్ ల తయారీదారిగా ఉండేది. విండోస్ ఫోన్ ప్లాట్ ఫామ్ ను ఎంచుకోవడం ఫిన్నిష్ కంపెనీ నిర్ణయానికి ఒక మాయని మచ్చగా మారింది.