‘లూమియా, ఆశ’ సిరీస్‌లో నోకియా.. కొత్త ఫోన్లు
పనాజి: మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం, నోకియా కంపెనీ లూమియా మోడల్‌లో రెండు కొత్త ఫోన్లను, ఆశా మోడల్‌లో మరో 2 కొత్త ఫోన్లను, మొత్తం నాలుగు కొత్త ఫోన్లను వచ్చే నెలలో మార్కెట్లోకి విడుదల చేయనున్నది. విండోస్ ఓఎస్ ఆధారిత లూమియా మోడల్‌లో 1320, 525 మోడళ్లను, చౌక ధరల స్మార్ట్‌ఫోన్ ఆశా మోడల్‌లో 500, 503ను అందించనున్నామని నోకియా ఇండియా డెరైక్టర్ విపుల్ మెహ్‌రోత్ర చెప్పారు. ఆశా 500 ధర రూ.4,499 అని, ఆశ 503 ధర రూ.6,799 అని పేర్కొన్నారు. లూమియా ధరలను ఆయన వెల్లడించలేదు. అయితే నోకియా కంపెనీ విదేశాల్లో లూమియా 1320ను 339 డాలర్లకు, లూమియా 525ను 199 డాలర్లకు విక్రయిస్తోంది.
నోకియా రెండో ఫ్యాబ్లెట్
నోకియా కంపెనీ రెండో ఫ్యాబ్లెట్ అయిన లూమియా 1320లో 6 అంగుళాల స్క్రీన్, హెచ్‌డీ డిస్‌ప్లే, 1.7 గిగా హెట్స్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగా పిక్సెల్ కెమెరా, వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక లూమియా 525లో 4 అంగుళాల టచ్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 1 గిగా హెట్స్ డ్యుయ ల్ కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఆశ 503లో 3 అంగుళాల స్క్రాచ్ రెసిస్టెంట్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్, 5 ఎంపీ కెమెరా వంటి ప్రత్యేకతలు, ఆశ 500లో 2.8 అంగుళాల స్క్రీన్, 2 మెగా పిక్సెల్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. నోకియా మొబైల్ ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ 700 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.