
సకాలంలో వైద్యం అంది ఉంటే..
రాజమండ్రి: పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు మృత్యువాత పడడం వెనుక సకాలంలో సహాయ చర్యలు అందకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బాధితులకు వెనువెంటనే వైద్యసేవలందించి ఉంటే చాలామంది ప్రాణాలతో బయటపడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లక్షలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా సరైన సదుపాయాలు కల్పించలేదు సరికదా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా భక్తులకు వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. పుష్కర ఘాట్ వద్ద తక్షణ వైద్య సేవలందించేందుకు నలుగురు వైద్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని, వీరికి మరో ఇద్దరు అదనంగా వైద్యులను అందుబాటులో ఉంచామని అధికారులు చెప్పారు.
భక్తులు గాయపడినా, మరైదేనా అనారోగ్యం బారిన పడినా ఆస్పత్రులకు తరలించేందుకు రివర్ అంబులెన్స్‌తో కలిపి ఆరు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామన్నారు. అయితే తొక్కిసలాట జరిగినప్పుడు ఒకే ఒక్క అంబులెన్స్ ఉండడం గమనార్హం. అంబులెన్స్‌ను ఘాట్ వద్దకు పంపాలని మైకుల ద్వారా పదేపదే చెబుతున్నా పట్టించుకున్నవారే లేకుండాపోయారు. ఉన్న ఒక్క అంబులెన్స్ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. పైగా అంబులెన్స్‌లో వీల్‌చైర్లు, స్ట్రెచర్లు లేకపోవడంతో అస్వస్థతకు గురైనవారిని చేతులతో మోసుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. మిగిలినవారిని పోలీసు జీపుల్లో ప్రభుత్వాస్పత్రులకు తరలించాల్సి వచ్చిందంటే ఘాట్‌ల వద్ద వైద్యసేవలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఘాట్‌ల వద్ద సరైన వైద్యసేవలు అంది ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అత్యధిక శాతం మంది అంటున్నారు. అపస్మారక స్థితికి వెళ్లిన భక్తులను సమీపంలో ఉన్న పోలీసులు పట్టించుకోలేదు. వారి బంధువులు నెత్తీనోరు బాదుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోకురోటి మాణిక్యం అనే వృద్ధురాలు ఘాట్ వద్ద సొమ్మసిల్లి పడిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులను బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. ఇది గమనించిన ‘సాక్షి’ బృందం విషయాన్ని అర్బన్ ఎస్పీ ఎస్.హరికృష్ణ దృష్టికి వెళ్లింది. ఆయన అధికారులకు చెప్పి వదిలేశారు. దీంతో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్వయంగా మాణిక్యం వద్దకు వచ్చి అక్కడ నుంచి తరలించి వైద్య సేవలందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.