
పెళ్లయ్యిందంటూ గుసగుసలు
చెన్నై: కాయలున్న చెట్టుకే దెబ్బలన్న సామెతగా నటి నయనతార గురించి ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. రెండు సార్లు ప్రేమలో ఓడిపోయిన ఆమె సంచలనాలకు కేంద్ర బిందువు కాదని ఎవరూ అనజాలరు. మొదట్లో శింబుతో ప్రేమ కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రేమ కథ కంచికి చేరడంతో కొన్నాళ్లు సెలైంట్‌గా ఉన్న నయనతార మళ్లీ ప్రభుదేవాతో కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. వారి ప్రేమ ..పెళ్లి పీటలెక్కడం ఖాయం అనుకున్నారు. అయితే అదీ తొలి ప్రేమ దారే పట్టింది. ఆ తరువాత ప్రేమా లేదు దోమ లేదు ఆ రెండింటికి తన జీవితంలోనే తావు లేదు అంటూ విరక్తిని వ్యక్తం చేసిన ఈ మలయాళీ భామ మరోసారిప్పుడు ప్రేమలో పడ్డట్లు కోలీవుడ్ కోడై కూస్తోంది.
ఆమె తాజాగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమలో పడ్డట్టు ప్రచారం మొదలై చాలా నెలలే అయ్యింది. ఈ నేపధ్యంలో దర్శకుడికి నయనతార ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చినట్టు, చెన్నైలో ఒక అందమైన ఇంటిని కొనిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా దర్శకుడు విఘ్నేశ్‌శివను నయనతార రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అదంతా వదంతేనంటూ దర్శకుడు కొట్టి పారేశారు. కాగా నయనతారతో ప్రేమ, రహస్య వివాహం గురించి దర్శకుడు విఘ్నేశ్‌శివను ప్రశ్నించగా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం అనవసరం అనే భావాన్ని వ్యక్తం చేయడం వారి మధ్య ఏదో ఉందనే సందేహానికి ఆస్కారం కలగక మానదంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.