జియో ఉచిత ఆఫర్పై మిట్టల్ ఘాటైన వ్యాఖ్య
జియో ఉచిత ఆఫర్పై మిట్టల్ ఘాటైన వ్యాఖ్య
Published Wed, Oct 26 2016 5:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
రిలయన్స్ జియో ఉచిత సేవా ఆఫర్లు ఇతర టెలికాం దిగ్గజాలకు విసుగెత్తిస్తున్నాయి. 4జీ మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో జీవితకాల ఉచిత వాయిస్ కాల్ ఆఫర్పై ట్రాయ్ ఇచ్చిన క్లీన్చీట్పై టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ విభేదిస్తోంది. ఏది ఎప్పటికీ ఉచితం కాదని, జియో ఉచిత వాయిస్ కాల్ ఆఫర్పై ట్రాయ్ పునఃసమీక్షించాల్సిందేనని ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జీఎస్ఎమ్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ ఈవెంట్లో పాల్గొన్న సునిల్ మిట్టల్ జియో ఆఫర్ చేస్తున్న ఉచిత వాయిస్ కాల్ ఆఫర్లపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. రిలయన్స్ జియో ఉచిత టారిఫ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ఏది కూడా జీవితకాలం పాటు ఉచితం ఉండదని మిట్టల్ పేర్కొన్నారు.
జియో టారిఫ్ ప్లాన్స్ ప్రస్తుత నిబంధనలకు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ఎలాంటి వివక్షపూరితమైన ఉద్దేశ్యం లేవని పేర్కొంటూ ట్రాయ్ ఇటీవలే ఆ కంపెనీకి క్లీన్ చీట్ ఇచ్చింది. కానీ జియో జీవితకాల ఉచిత వాయిస్ కాల్ ఆఫర్ దోపిడీ పద్దతులకు తెరతీసేలా ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా జియోకు ఇంటర్కనెక్షన్ ఇవ్వడం లేదని ఎయిర్టెల్తో పాటు, ఇతర టెలికాం కంపెనీలకు ట్రాయ్ విధించిన జరిమానాపై సునిల్ మిట్టల్ స్పందించారు. జియోకు ఆఫర్ చేస్తున్న ఇంటర్కనెక్షన్ పాయింట్లలో ట్రాయ్ కచ్చితంగా కొంత తికమక పడి ఉంటుందని మిట్టల్ ఆరోపించారు. అక్టోబర్ 21న ట్రాయ్ రిలయన్స్ జియోకు అవసరమైన ఇంటర్కనెక్షన్ పాయింట్లు ఇవ్వడం లేదని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్లకు రూ.3,050కోట్ల భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
Advertisement