
అపార్టుమెంట్ల వైపే ఎన్నారైల మొగ్గు!
దేశం వెలుపల నివసిస్తున్న ఎన్నారైలలో ఎక్కువమంది స్వదేశంలో అపార్టుమెంట్ల కొనుగోలుకే మొగ్గు చూపిస్తున్నారట. అది కూడా ఎక్కువమంది బెంగళూరులో కొంటే బాగుంటుందని భావిస్తున్నారు. ఈ విషయం ఓ సర్వేలో తేలింది. స్థలాలు, పొలాలు, విల్లాలు, వాణిజ్య ప్రాంతాలు కొనేకంటే.. అపార్టుమెంట్ల కొనుగోలుకే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ప్రధానంగా ఫ్లాట్ల కొనుగోలులో భద్రత ఉంటుందని వాళ్లు అంటున్నారట. రాబోయే ఆరు నెలల్లో దాదాపు 70 శాతానికి పైగా ఎన్నారైలు ఫ్లాట్లు కొంటామని చెబుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉండే అపార్టుమెంట్లయితే పూర్తిస్థాయి భద్రతతో పాటు మంచి గార్డెన్లు, క్లబ్ ఫెసిలిటీలు, నిర్వహణలో ఇబ్బంది లేకపోవడం, అద్దె వసూళ్లలో సౌలభ్యం అన్నీ ఉంటాయని వాళ్లు భావిస్తున్నారు.
కాగా, ఎన్నారైలు ఫ్లాట్ల కొనుగోలులో చాలావరకు బెంగళూరునే తమ పెట్టుబడికి స్వర్గధామం అనుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ముంబై, చెన్నై, పుణె, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్, నవీముంబై, గోవా, అహ్మదాబాద్ ఉన్నాయని సర్వే సంస్థ తెలిపింది. దుబాయ్ ప్రాంతంలో ఉన్న దాదాపు 15వేల మంది ఎన్నారైలతో ఈ సర్వే నిర్వహించారు. వచ్చే నెలలో జరగబోయే ఇండియన్ ప్రాపర్టీ షో సందర్భంగా ఈ నివేదిక విడుదల చేశారు.