ఎన్‌టీపీసీ లాభం రూ.2,898 కోట్లు
క్యూ2లో 40 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఎన్‌టీపీసీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ కాలానికి రూ.2,898 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి సాధించిన నికర లాభం (రూ.2,072 కోట్లు)తో పోల్చితే 40 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది. అధికంగా విద్యుదుత్పత్తి పెరగడమే నికర లాభం వృద్ధికి ప్రధాన కారణమని పేర్కొంది. గత క్యూ2లో రూ.17,267 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.18,174 కోట్లకు పెరిగిందని వివరించింది. విద్యుదుత్పత్తి ఆదాయం రూ.16,806 కోట్ల నుంచి రూ.17,950 కోట్లకు, స్థూల విద్యుదుత్పత్తి 55.448 బిలియన్ యూనిట్ల నుంచి 8 శాతం వృద్ధితో 60.159 బిలియన్ యూనిట్లకు పెరిగాయని తెలిపింది.
ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆడిట్ కాని ఫలితాలు ఇలా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి రూ.36,137 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి రూ.35,497 కోట్లకు తగ్గింది. నికర లాభం రూ.4,273 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.5,034 కోట్లకు పెరిగింది. దేశంలో అతి పెద్ద విద్యుదుత్పత్తి సంస్థ అయిన ఎన్‌టీపీసీ స్థాపిత సామర్థ్యం 45,548 మెగావాట్లు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఎన్‌టీపీసీ షేర్ 1.1 శాతం క్షీణించి రూ.128 వద్ద ముగిసింది.