ఢిల్లీ 5 స్టార్ హోటల్లో నర్సుపై గ్యాంగ్రేప్
ఆడవాళ్లు అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని గాంధీ మహాత్ముడు చెప్పారు. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం రోజు రాత్రే.. దేశ రాజధాని ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో గల ఓ సూట్లో 27 ఏళ్ల నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్నఓ మహిళను చూసుకోడానికి ఈ నర్సును నియమించారు. అయితే.. సదరు బాధితురాలికి సహాయకులుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులే ఆ నర్సుపై అఘాయిత్యం చేశారు.
సంఘటనతో తీవ్రంగా కలత చెందిన నర్సు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా, తన భర్తకు చెప్పింది. అయితే.. నిందితులు ఆమెపై మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. వాళ్లను నీరజ్ (25), రాజన్ (23)గా గుర్తించారు. తాను అత్యాచారాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించగా, ఉద్యోగం పీకేస్తామని వాళ్లు బెదిరించి, ఒకరి తర్వాత ఒకరుగా పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధిత నర్సు తన ఫిర్యాదులో పేర్కొంది.