
మా ఆవిడకి భయపడి.. సిగరెట్లు మానేశా: ఒబామా
ప్రపంచాన్ని గడగడలాడించే సామర్థ్యం గల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా... ఇంట్లో వాళ్లావిడ ముందు మాత్రం పిల్లిలాగే ఉంటారు!! ఆమె అంటే భయపడి చివరకు సిగరెట్లు కాల్చడం మానేశారట!! ఈ విషయాన్ని స్వయంగా ఒబామాయే ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ అధికారికి చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి మైనా కై ఆయన పొగతాగే అలవాటు గురించి ప్రశ్నించారు. తాను అప్పుడప్పుడు కాలుస్తున్నట్లు కూడా చెప్పారు.
ఒబామా మాత్రం.. తాను మిషెల్ అంటే భయంతో సిగరెట్లు కాల్చే అలవాటు మానేసుకున్నట్లు చెప్పారు. గడిచిన ఆరేళ్ల నుంచి మిషెల్ భయంతో ఒక్క సిగరెట్టు కూడా ముట్టుకులేదని తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన మొదట్లో కూడా తాను సిగరెట్లు బాగానే కాల్చేవాడినని అన్నారు. పిల్లల ముందు, కుటుంబం ముందు కూడా ఎప్పుడూ కాల్చలేదని తెలిపారు. ఎట్టకేలకు ఇప్పుడు మిషెల్ భయం పుణ్యమాని.. 95 శాతం వరకు తన పొగతాగే అలవాటు పోయిందని స్పష్టం చేశారు. పిల్లలు పెద్దవాళ్లయిపోతున్నందున వాళ్ల ముందు ఏదీ దాచడం కుదరదని, అందువల్ల సిగరెట్లు మానేయాల్సిందేనని మిషెల్ తనను ఆదేశించినట్లు ఒబామా చెప్పారు.