
పోలవరం నిర్మాణానికి ఆటంకాలున్నాయి: జైరాం
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే మృతి దేశానికి తీరని లోటని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ... ముండే మృతి చెందారన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ముండే మంచి నాయకుడని ఆయన అభివర్ణించారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు తామిచ్చిన హామీను పార్లమెంట్ గతంలో ఆమోదించిందని జైరాం ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఆ హామీలన్నింటిని ఎన్డీయే ప్రభుత్వం అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలున్నాయని... అయితే వాటిని అధిగమించి ముందుకెళ్లాలని ఆయన ప్రస్తుత ప్రభుత్వానికి సూచించారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ వల్ల 50 వేల కుటుంబాలు నిరాశ్రయులవుతారని ఆయన గుర్తు చేశారు. ఆయా కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందన్నారు.