పాత 500 నోటు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి!! | Odisha boy makes electricity from Rs 500 notes | Sakshi
Sakshi News home page

పాత 500 నోటు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి!!

Published Mon, May 22 2017 2:11 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

పాత 500 నోటు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి!! - Sakshi

పాత 500 నోటు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి!!

మోదీ ప్రభుత్వం రాత్రికి రాత్రి ఉన్నట్టుండి 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడంతో తమవద్ద కట్టలకొద్దీ ఉన్న నోట్లను ఏం చేసుకోవాలో తెలియక చాలామంది తల బద్దలుకొట్టుకుంటే, ఒడిసాలోని నౌపడ ప్రాంతానికి చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థి మాత్రం.. వాటి నుంచి విద్యుత్తు తయారుచేసే టెక్నిక్‌ కనుగొన్నాడు. అతడి వినూత్న ఆలోచన అందరి దృష్టిని ఆకర్షించింది. చివరకు ప్రధానమంత్రి కార్యాలయం కూడా అర్జంటుగా ఈ విషయంపై ఒక ప్రాజెక్టు రిపోర్టు సమర్పించాలని రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖను ఆదేశించింది.

ఒకే ఒక్క 500 రూపాయల నోటు నుంచి 5 వోల్టుల వరకు విద్యుత్తు వస్తుందని ఖరియార్‌ కాలేజిలో చదివే లచ్మన్‌ దుండి అనే ఈ విద్యార్థి చెప్పాడు. నోటు మీద ఉన్న సిలికాన్‌ కోటింగు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, ఆ కోటింగ్‌ బాగా కనిపించేందుకు తాను నోటును చించానని, దానికి నేరుగా సూర్యరశ్మి తగిలేలా చేసి, సిలికాన్‌ ప్లేటును విద్యుత్‌ వైరు సాయంతో ట్రాన్స్‌ఫార్మర్‌కు కలిపానని, దాంతో విద్యుత్‌ పుట్టిందని వివరించాడు. ఈ విషయాన్ని ఒకసారి తనిఖీ చేయాలని ఏప్రిల్‌ 12వ తేదీన ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మే 17న ఒడిషా ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులను స్వయంగా వెళ్లి దుండీ ప్రాజెక్టు చూసి ఒక నివేదికను పీఎంఓకు పంపాలని తెలిపింది. సిలికాన్‌ ప్లేటు నుంచి వచ్చే విద్యుత్తును నిల్వచేసేందుకు ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను తయారుచేశానని, తన ఆవిష్కరణను ప్రధాని కార్యాలయం మెచ్చుకుంటే చాలా సంతోషిస్తానని అంటున్నాడు. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించవచ్చని ఆలోచించానని, నోటును కాస్త చించి చూస్తే అందులో సిలికాన్‌ ప్లేట్‌ కనిపించిందని, అక్కడినుంచి తన పరిశోధన మొదలుపెట్టి, విజయవంతంగా విద్యుత్‌ తయారు చేశానని వివరించాడు. మొదట్లో తన కాలేజీలో దీన్ని ప్రదర్శించినపుడు అతడిని ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి లేఖలు రాయడంతో అతడి విషయం వెలుగులోకి వచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement