ఒడిశాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులు మృతిచెందారు.
కొరాపుట్/అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: ఒడిశాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కరడుగట్టిన మావోయిస్టులు మృతిచెందారు. కొరాపుట్ జిల్లాలో ఉన్న ముంగుడవలస అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్టు పేర్కొన్నారు. మృతులిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఒకరు అనంతపురం జిల్లాకు చెందిన మల్లా సంజీవ్ అలియాస్ యాదన్న, మరొకరిని ఖమ్మం జిల్లాకు చెందిన ఎపె స్వామి అలియాస్ నరేందర్‌గా గుర్తించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలపై మావోలు కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ జరిగిందని వివరించారు. ఉద్యమాన్ని బలోపేతం చేసే క్రమంలోనే వీరు తూర్పు విశాఖ నుంచి ఇక్కడకు చేరుకున్నారని, వీరిపై పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
క్రియాశీల పదవుల్లో కొనసాగిన సంజీవ్
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మల్లా సంజీవ్(38)ది అనంతపురం జిల్లా, కంబదూరు మండలం గూళ్యం గ్రామం. కళ్యాణదుర్గంలో టెన్త్ చదివిన ఆయన చిన్న వయసులోనే నక్సల్‌బరి ఉద్యమాలకు ఆకర్షితుడై 1999లో మావోయిస్టు పార్టీలో చేరి కీలక పదవుల్లో కొనసాగాడు. రామగిరి మండలంలోని పలు ప్రాం తా ల్లో దాడులు, పేరూరు ఎక్స్ఛేంజ్ కార్యాలయం పేల్చివేత, పరిటాల రవీంద్ర సన్నిహితుడు చమన్‌పై దాడి, కరువు దాడుల ఘటనల్లో సంజీవ్‌పై కేసులున్నాయి. దీంతో పోలీసు నిఘా పెరగడంతో కర్ణాటకకు తరిలిపోయాడు. అక్కడా పోలీసుల నిఘా పటిష్టం కావడంతో మల్కన్‌గిరి దళంలోకి చేరి ఆర్గనైజర్, కమాండర్ పదవుల్లో కొనసాగాడు. మల్కన్‌గిరి దళం నుంచి ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు(ఏఓబీ) దళంలోకి అడుగిడిన ఆయన దళంలోని ఓ సభ్యురాలిని వివాహమాడాడు.