స్విమ్‌సూట్‌లో హిల్లరీ చిత్రంపై దుమారం!
అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ స్విమ్‌సూట్‌లో ఉన్న కూఢ్యచిత్రం (వాల్ పెయింటింగ్) ఒకటి ఆస్ట్రేలియాలో దుమారం రేపుతోంది. హిల్లరీని కించపరిచేలా అసభ్యంగా ఉన్న ఈ చిత్రాన్ని తొలగించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
మెల్‌బోర్న్ శివార్లలోని ఫుట్‌స్క్రే ప్రాంతంలోని ఓ గోడ మీద లష్‌సక్స్ అనే చిత్రకారుడు హిల్లరీ బొమ్మ వేశాడు. అతడు గతంలో డొనాల్డ్ ట్రంప్, కిమ్ కర్దాషియన్ బొమ్ములు కూడా గోడలపై వేశాడు. స్విమ్‌సూట్‌లో డాలర్లు పెట్టుకొని ఉన్నట్టు ఉన్న ఈ చిత్రం రెచ్చగొట్టేలా ఉందని, హిల్లరీ క్లింటన్‌ను ఇది అవమానపరచడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని తొలగించాలని డిమాండ్లు రావడంపై చిత్రకారుడు లష్‌సక్స్ విచారం వ్యక్తం చేశారు. కళ పట్ల ఇలాంటి ఆంక్షలు ఉండరాదని అతడు అంటున్నాడు.
అయితే, మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఈ గ్రాఫిటీని తొలగించాని నిర్ణయించారు. దాదాపు నగ్నంగా ఉన్న మహిళా చిత్రాన్ని గ్రాఫిటీగా వేయడం చట్టవిరుద్ధమని, అందుకే తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ భార్య మెలీనియా ట్రంప్ అర్ధనగ్న చిత్రాన్ని కూడా అతడు గతంలో గోడలపై చిత్రించాడు.