2,600 ఎకరాల్లో కార్యాలయాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో భాగంగా దాదాపు 2,600 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ప్రణాళికలు రూపొందించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి దశలవారీగా పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. సచివాలయం, ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, స్వయం ప్రతిపత్తి గల శాఖలు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, స్టేట్ గెస్ట్‌హౌస్, వీఐపీ హౌసింగ్, స్టాఫ్ హౌసింగ్‌కు 104.6 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు ఆర్కిటెక్చర్ అండ్ అర్బన్ డిజైన్, ల్యాండ్ స్కేపింగ్, ఇంటీరియర్ డిజైన్లను అందించే అనుభవం ఉన్న సంస్థల నుంచి రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది.
టెండర్ల స్వీకరణకు ఆఖరు తేదీ ఈ నెల 11. టెండర్లను 14వ తేదీన ఖరారు చేయనున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.1,850 కోట్లు విడుదల చేసినా ఇప్పటివరకు పైసా కూడా ఖర్చు చేయలేదని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో కార్యాలయాల నిర్మాణాలు చేపట్టేందుకు సీఆర్‌డీఏ హడావుడిగా ప్రతిపాదనలు రూపొందించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రధానమైన నిర్మాణాలు అసెంబ్లీ, హైకోర్టు మినహా మిగిలిన నిర్మాణాలకు ఎంత స్థలం కావాలో.. ఎంత చదరపు అడుగుల్లో ఈ నిర్మాణాలు ఉంటాయో సీఆర్‌డీఏ పేర్కొంది.