బాధితురాలి ఆవేదన, పొలంలో పారుతోన్న మద్యం(కుడి)
వైశాలి: మొన్నటిదాకా భారీ వర్షాలతో అతలాకుతలమైన బిహారీలు.. నేడు పొలాల్లో పారుతోన్న మద్యం వరదను చూసి బెంబేలెత్తుతున్నారు. మద్యనిషేధం కఠినంగా అమలవుతోన్న బిహార్‌లో ప్రభుత్వ అధికారుల అత్యుత్సాహం పేద రైతుల పాటిట శాపంగా మారింది. మద్యంతో పొలాన్ని తడిపేసిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
వైశాలి జిల్లా అబ్కారీ అధికారులు ఇటీవల జరిపిన సోదాల్లో భారీ ఎత్తున అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశానుసారం శుక్రవారం ఆ మద్యం సీసాలను ధ్వసం చేయడానికి పూనుకున్నారు. ఓ గ్రామ శివారులోని బాటిలింగ్ ప్లాంట్ వెలుపల మద్యం కాటన్లను ఉంచి, జేసీబీతో వాటిని నలగొట్టేశారు. చుట్టుపక్కల పచ్చటి పొలాలున్నాయన్న ఇంగితాన్ని మర్చిపోయారు.
మొత్తం లక్ష లీటర్ల మద్యం.. అక్కడి పంటలను ముంచెత్తింది. విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నారు. అయినాసరే ఇవేవీ పట్టించుకోని అధికారులు.. ‘కోర్టు చెప్పింది.. మేం చేశాం’ అని చేతులు దులుపుకొని వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించాల్సిఉంది.