
ఆయన వ్యాఖ్యలతో పెట్రోల్ ధరల మంట!
న్యూయార్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు ’మంట’ పెడుతున్నాయి. రష్యా, ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ) కలిసి ముడిచమురు ఉత్పత్తిని స్తంభింపజేయాలని భావిస్తున్నాయని పుతిన్ తాజాగా పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయంగా తగ్గాల్సిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోగా.. పెరిగిపోయాయి.
వచ్చేవారం చైనాలో జరగనున్న గ్రూప్ ఆఫ్ 20 దేశాల సదస్సులో భాగంగా తాను సౌదీ అరేబియా డిప్యూటీ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భేటీ అయి, ఈ విషయమై సమగ్ర ప్రణాళికపై చర్చిస్తానని పుతిన్ పేర్కొన్నారు. ఆయన ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది. పుతిన్ వ్యాఖ్యల నేపథ్యంలో రానున్న వారాల్లో ముడిచమురు ఉత్పత్తి స్తంభించిపోవచ్చునని, దీంతో ధరలు పెరిగిపోవచ్చునని భావిస్తున్నారు. ఈ భయాందోళనల నేపథ్యంలోనే ఈ వారం ముడిచమురు ధర పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో న్యూయార్క్ మర్చంటైల్ ఎక్స్చేంజ్ లో బ్యారెల్ ముడిచమురు ధర 1.28 డాలర్లు పెరిగి.. 44.44 డాలర్లకు చేరగా, లండన్ ఐసీఎఫ్ ఫ్యుచర్ ఎక్స్చేంజ్ లో1.38 డాలర్లు పెరిగి .. 46.83 డాలర్లకు చేరింది. నిజానికి మార్కెట్‌లో ముడిచమురు సరఫరా అధికం కావడంతో ఈ వారంలో వరుసగా నాలుగు సెషన్లలో ధర తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ముడిచమురు ఎగుమతి దేశాలు సరఫరాను నిలిపివేస్తే మళ్లీ ధరలు పెరిగే అవకాశముంది.