
కాల్పులు.. సూక్తులు..!
భారత్‌పై పాక్ తీరు
ఇస్లామాబాద్/శ్రీనగర్: ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్.. మరోవైపు తమ దేశంపై నిందలు మోపే అలవాటును మానేయాలంటూ భారత్‌కు నీతులు చెప్తోంది. గత వారం రోజులుగా స్వల్ప విరామాలతో నియంత్రణ రేఖ వద్ద, అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సరిహద్దు దళాలపై పాక్ ఆర్మీ వరుస కాల్పులకు తెగబడుతోంది. తాజాగా, జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఉన్న హమీర్‌పూర్ సెక్టార్‌లోని భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ పోస్టులపై ఆదివారం రాత్రంతా పాక్ సైన్యం ఆటోమేటిక్ ఆయుధాలు, మోర్టార్ షెల్స్, 120 ఎంఎం మోర్టార్లతో దాడులు చేసింది. దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. గత 9 రోజుల్లో 17 సార్లు పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. కాగా, ఇరు దేశాల మధ్య జాతీయ భద్రతా సలహాదారుల స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో.. పాక్‌పై నిందలు మోపడం భారత్ ఆపేసి, సానుకూల దృక్పథంతో ఎన్‌ఎస్‌ఏ స్థాయి చర్చలకు రావాలని పాక్ మంత్రి ఆసిఫ్ సూచించారు.
అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చారు
జమ్మూకశ్మీర్‌లో అధికారంలో ఉన్న పీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చిందని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ మండిపడ్డారు. శ్రీనగర్లో సోమవారం ఒక ర్యాలీనుద్దేశించి ప్రసంగిస్తూ.. పాకిస్తాన్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ పార్లమెంటరీ యూనియన్ సదస్సులో పాల్గొనేందుకు జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌కు పాక్ ఎందుకు ఆహ్వానం నిరాకరించిందో సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ‘కశ్మీర్ అంశంపై అసెంబ్లీలో చర్చించనంతవరకు ఒక్క పాకిస్తానే కాదు.. ఎవరూ కూడా ఈ అసెంబ్లీని సీరియస్‌గా తీసుకోరు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వమే కాదు, ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలూ అసెంబ్లీ పరువును దిగజార్చాయన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానాన్ని, అఫ్జల్‌గురు ఉరిపై తీర్మానాన్ని తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.