
ముస్లిం మహిళల పట్ల లింగ వివక్షపై విచారణ
ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: విడాకులు లేదా భర్త వేరే పెళ్లి చేసుకోవడం లాంటి విషయాల్లో ముస్లిం మహిళలు లింగ వివక్షకు గురవుతున్నారా? అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ‘ముస్లిం మహిళలు(విడాకుల్లో రక్షణ హక్కులు)’ చట్ట అంశాలను పరిశీలించేందుకు మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని, సంబంధిత అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని రిజిస్టర్ చేయాలని జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ ఏకే గోయల్‌ల ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
‘రాజ్యాంగం హామీ ఇచ్చినా, ముస్లిం మహిళలు లింగ వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఏకపక్ష విడాకులు, మొదటి పెళ్లి అమల్లో ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకోవడం వంటి విషయాల్లో వారికి తగిన రక్షణ ఏర్పాట్లు లేవు. దీంతో ముస్లిం మహిళ సమాజంలో రక్షణ, గౌరవం కోల్పోతోంది’ అని పేర్కొంది.