ఆన్‌లైన్ సూపర్‌బజార్లు! | Online Super Bazar | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ సూపర్‌బజార్లు!

Published Wed, Oct 9 2013 1:25 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM

ఆన్‌లైన్ సూపర్‌బజార్లు!

ఆన్‌లైన్ సూపర్‌బజార్లు!

నిత్యావసర సరుకుల మార్కెట్ లక్షల కోట్ల రూపాయల పరిమాణంలో ఉన్న నేపథ్యంలో రిలయన్స్, బిర్లా వంటి అనేక పెద్ద సంస్థలు సైతం ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి. కొన్ని సంస్థలు టెక్నాలజీని ఉపయోగించుకుని, ఆన్‌లైన్లోనే సూపర్‌మార్కెట్లను తెరిచేస్తున్నాయి. వెబ్‌సైట్లో ఆర్డరిస్తే చాలు శిశు సంరక్షణ ఉత్పత్తులు మొదలు కూరగాయల దాకా ఇంటి ముంగిట్లోనే అందిస్తున్నాయి. కోట్ల కొద్దీ రిటైల్ వ్యాపారంలో కనీసం అరశాతం వాటానైనా దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ముంబైకి చెందిన లోకల్‌బన్యా, బెంగళూరుకి చెందిన బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్ వంటి సంస్థలు ఈ సర్వీసులు అందిస్తున్నాయి.
 
 ఇంటి నుంచే కొనుగోళ్లు జరిపే సౌలభ్యం కోరుకునే కస్టమర్లను టార్గెట్‌గా ఎంచుకున్న ఆన్‌లైన్ సూపర్‌మార్కెట్ సంస్థలు.. లావాదేవీల నిర్వహణలో ఒక్కోటీ ఒక్కో విధానం పాటిస్తున్నాయి.  ఉదాహరణకు లోకల్‌బన్యా.. తమ సైట్‌కి వచ్చిన ఆర్డర్లన్నీ పోగేసి..అదే రోజు సాయంత్రం కొనుగోళ్లు జరుపుతుంది. మర్నాటికల్లా డెలివరీ చేస్తుంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ వంటి సంస్థల నుంచి లోకల్‌బన్యా కొనుగోళ్లు జరుపుతోంది. ప్రస్తుతం సంస్థకి ప్రతి రోజూ 200 ఆర్డర్ల పైచిలుకు వస్తున్నాయి. వీటి విలువ రూ.1,300 నుంచి రూ. 1,500 దాకా ఉంటోంది.
 
 ఫ్రెంచ్ పర్పుల్ క్యాబేజ్ వంటి విభిన్న కూరగాయలు, ఫలాలను కూడా సమకూర్చడం ఈ సంస్థ ప్రత్యేకత. ఈ ఏడాది సుమారు రూ. 23 కోట్ల వ్యాపారం చేయొచ్చని అంచనా వేస్తోంది. బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్ పోర్టల్ ప్రస్తుతం బెంగళూరులో సుమారు 1,500-2,000 ఆర్డర్లు దక్కించుకుంటోంది. ఈ విలువ రోజుకి రూ. 25 లక్షల మేర, నెలకైతే రూ. 7-8 కోట్ల మేర ఉంటోంది. బెంగళూరులో కంపెనీ 20-30 శాతం వృద్ధి సాధిస్తోంది. త్వరలో బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు హైదరాబాద్, ముంబై తదితర నగరాల్లో లాభాలు సాధించవచ్చని అంచనా వేస్తోంది. సాధారణంగా ప్రతి వెబ్‌సైట్లోను కనీస మొత్తం ఆర్డరు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు లోకల్‌బన్యాలో కనీస ఆర్డరు మొత్తం విలువ రూ. 500గా ఉంటోంది. వెబ్‌సైట్లో కావాల్సిన సరుకులను ఎంపిక చేసుకుని, ఏ సమయంలో డెలివరీ కావాలన్నది సూచిస్తే చాలు.. ఇంటి వద్దకే చేరతాయి.
 
 మౌలిక సదుపాయాలు..
 ఆర్డర్లకు తగ్గ వస్తువులను నిల్వ చేసుకోవడం తదితర అంశాలపై కూడా ఆన్‌లైన్ సంస్థలు దృష్టి పెట్టాయి. ఆర్డరు ఇచ్చిన రోజే డెలివరీ కాన్సెప్టుతో పనిచేసే బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్.. సొంతంగా కోల్డ్ స్టోరేజీలు, వేర్‌హౌస్‌లు ఏర్పాటు చేసుకుంది. ఆరామ్‌షాప్‌డాట్‌కామ్ సంస్థ కిరాణా షాపుల్లాంటివి తమ వెబ్‌సైట్లో పేర్లు, చిరునామాలు నమోదు చేసుకునే సౌలభ్యం కల్పిస్తున్నాయి. కస్టమర్లు సైట్‌లో ఉన్న రిటైలర్లను సంప్రదించేందుకు దీనితో వీలుపడుతుంది. కస్టమర్లు కావాలంటే సైట్‌లోనే తమ షాపింగ్ లిస్టును పొందుపర్చుకోవచ్చు. ఆ జాబితాను రిటైలర్లకు ఎస్‌ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. రిటైలర్లకు బేసిక్ సర్వీసులు ఉచితంగానే అందిస్తున్నా.. ప్రత్యేక ఆఫర్లు లాంటి ప్రకటనలు ఇవ్వదల్చుకుంటే మాత్రం కొంత మొత్తాన్ని ఆరామ్‌షాప్ వసూలు చేస్తోంది. అంతేగాకుండా అసలు కొనుగోలుదారులు ఎలాంటి వస్తువులు కొంటున్నారు వంటి విశ్లేషణాత్మక వివరాలను కూడా సంస్థ అందిస్తుంది. త్వరలోనే ఔషధాలను కూడా అందించాలని భావిస్తోంది. కస్టమర్ ప్రిస్క్రిప్షన్‌ని స్కాన్ చేసి పంపితే.. దాన్ని రిటైలర్‌కి పంపి.. సదరు ఔషధాలను అందుకునే వెసులుబాటు కల్పించనుంది.
 
 విస్తరణ ప్రణాళికలు..
 లోకల్‌బనియా ..పుణే, ఢిల్లీ వంటి నగరాల్లోకి విస్తరించే దిశ గా కసరత్తు చేస్తోంది. వెంచర్ క్యాపిటల్ సంస్థల నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు, బిగ్‌బాస్కెట్‌డాట్‌కామ్ కూడా ఈ ఏడాది మరో నగరాల్లో ప్రవేశించాలని.. 2014 ఆఖరు నాటికి 10 మొత్తం పది సిటీల్లోకి విస్తరించాలని నిర్దేశించుకుంది. అటు ఆరామ్‌షాప్ పొరుగుదేశం పాకిస్తాన్‌లోని కరాచీలోనూ కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. 2014 నాటికల్లా 30,000 రిటైలర్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సరైన విధంగా నిల్వలను, సరఫరాను పాటించగలిగితే ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థలకు మంచి వ్యాపారావకాశాలే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement