మంకీగేట్: భజ్జీ ఏం తిట్టాడో 'ఆయన'కే తెలుసట!
కోల్‌కతా: 2007-08లో భారత్-ఆస్ట్రేలియా సిరీస్ రెండో టెస్టు సందర్భంగా చోటుచేసుకున్న 'మంకీగేట్' వివాదం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో తనను ఉద్దేశించి భారత బౌలర్ హర్భజన్ సింగ్ 'మంకీ' (కోతి) అన్నాడని, ఇవి జాతివిద్వేషపూరితమైన వ్యాఖ్యలని ఆసీస్ బ్యాట్స్‌మన్ ఆండ్రూ సిమండ్స్ అప్పట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం చినికిచినికి ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలపై ప్రభావం చూపించేంతగా దుమారం రేపింది. అయితే, ఈ వివాదానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియా క్రికెటర్ మైఖేల్ క్లార్ తాజాగా స్పందించారు.
క్లార్క్ ఆత్మకథ 'మై స్టోరీ' పుస్తకాన్ని కోల్‌కతాలో ఆవిష్కరించిన సందర్భంగా 'మంకీగేట్' వివాదాన్ని సరదాగా గంగూలీ ప్రస్తావించారు. 'కొన్నిసార్లు అసలైన నిజమేమిటో ప్రపంచానికి తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పుస్తకంలో 'మంకీగేట్' అధ్యాయం గురించి పూర్తి వాస్తవాలు మీకు లభించకపోవచ్చు' అని పేర్కొన్నారు. ఇంతకూ సిమండ్స్‌ను భజ్జీ 'మంకీ' అన్నాడా? లేక ఇంకా ఏదైనా తిట్టాడా? అన్నది ఇప్పటికీ మిస్టరీనే.. దీనిపై స్పందిస్తూ.. అప్పుడు హర్భజన్ ఏం అనాలనుకున్నాడో కేవలం 'సర్దార్జీ'కి మాత్రమే తెలుసునని గంగూలీ చమత్కరించారు. ఈ వివాదాన్ని మీరు 'మంకీగేట్' లేదా, 'హనుమాన్ గేట్' అని ఎలాగైనా పిలుచుకోవచ్చునని సలహా ఇచ్చారు. సిమండ్స్ ఈ వివాదాన్ని మరీ ఇంతదూరం లాగి ఉండాల్సింది కాదని క్లార్క్ పేర్కొన్నారు.