‘రాయల’ను గట్టిగా వ్యతిరేకించండి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం మేరకు పది జిల్లాలతో కూడిన తెలంగాణకే తాము సమ్మతిస్తామని, రాయల తెలంగాణ పేరుతో కొత్త నాటకాలను తాము అంగీకరించబోమని తెలంగాణ జేఏసీ నేతలు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డికి స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఏ రూపంలో వచ్చినా గట్టిగా వ్యతిరేకించాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ బిల్లుకు జాతీయ పార్టీల మద్దతుకూడగట్టేందుకు ఢిల్లీకి వచ్చిన జేఏసీ నేతలు కోదండరాం, దేవీ ప్రసాద్, రాజేందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌లు జైపాల్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. విభజన అంశం సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ కొత్తగా రాయల అంశాన్ని తెరపైకి తేవడంపై వారంతా జైపాల్ వద్ద అసహనాన్ని వ్యక్తంచేశారు. రాజకీయ లభ్ధిని ఆశించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరచడమేనని వారు అన్నట్లు తెలిసింది. దీనిపై జైపాల్ స్పందిస్తూ, ఈ విషయమై తాను ప్రధాని మన్మోహన్ సహా ఇతర ముఖ్య నేతలతో చర్చిస్తున్నానని, రాయల తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించానని చె ప్పారు.
నేడు రాజ్‌ఘాట్ వద్ద మౌన దీక్ష
రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు మౌన దీక్ష పాటించనున్నట్టు టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్ తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.