
మేం అధికారంలోకొస్తే కోచింగ్ సెంటర్లు ఫ్రీ..!
సీతాపూర్ (ఉత్తరప్రదేశ్): 'మేం అధికారంలోకి వస్తే.. యువత కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి నగరంలో ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం' అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. యూపీలోని సీతాపూర్‌లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన ఓటర్లపై పలు హామీల వర్షం కురిపించారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని కోరారు.
'నరేంద్రమోదీగారు.. రైతుల రుణాలు మాఫీ చేసేందుకు ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిన అవసరం లేదు. మీరు, ప్రధానమంత్రి.. కాబట్టి మీరు కోరుకుంటే వాటిని వెంటనే మాఫీ చేయవచ్చు' అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీరుపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఉత్తరప్రదేశ్‌లో అధికారం కోసం ఎస్పీ-కాంగ్రెస్ కూటమి, బీజేపీ, బీఎస్పీ మధ్య హోరాహోరీ నెలకొన్న సంగతి తెలిసిందే.