ఇండియాకు పాకిస్తాన్ వార్నింగ్
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి కాల్పుల వ్యవహారం భారత్-పాకిస్తాన్‌ల మధ్య మరోసారి దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. ఎల్‌వోసీని ఆనుకుని ఉన్న గ్రామాలపై భారత బలగాలు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నాయని పాకిస్తాన్ ఆరోపించింది. దీనికి సమాధానం చెప్పాలంటూ ఇస్లామాబాద్‌లోని భారత డిప్యూటీ హైకమిషనర్‌కు పాక్ విదేశాంగ శాఖ సోమవారం సమన్లు జారీచేసింది. తక్షణమే కాల్పులు ఆపకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.
‘జూన్ 10, 12 తేదీల్లో ఎల్‌వోసీలోని సచిరికోట్, హాట్‌స్పైరింగ్ సెక్టార్లపైకి భారత బలగాలు జరిపిన కాల్పులు ముగ్గురు పౌరులు చనిపోయారు. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్ పదేపదే ఉల్లంఘిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇండియన్ డిప్యూటీ కమిషనర్ జేపీ సింగ్‌కు సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్ సమన్లు జారీచేశారు’ అని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. సైన్యం కూడా పౌరులు చనిపోయిన విషయాన్ని నిర్ధారించిందని, భారత్ చర్యను మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది.