పాక్ స్వాతంత్ర్య దినోత్సవం: కశ్మీర్లో కలకలం
జమ్ము: పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఆదివారం కశ్మీర్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. పూంఛ్ జిల్లాలో పాక్ బలగాల కాల్పులు, బుద్ధ అమర్ నాథ్ యాత్రికులపై గ్రెనేడ్ దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్.. ఢిల్లీలోని జరిగిన స్వాతంత్ర్యవేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పూంఛ్ జిల్లా సరిహద్దులో ఆదివారం ఉదయం పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. భారత జవాన్లే లక్ష్యంగా మిషిన్ గన్స్, మోర్టార్ రాకెట్లతో దాడి చేసిందింది. దీనిని తిప్పి కొట్టే క్రమంలో భారత బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కాల్పులు కొనసాగుతున్నయని, ఎవరైనా గాయపడిందీ, లేనిదీ ఇప్పుడే చెప్పలేమని భద్రతాబలగాల ప్రతినిధులు పేర్కొన్నారు. నాలుగు నెలల తర్వాత ఇరుదేశాల జవాన్ల మధ్య కాల్పులు జరగడం ఇదే మొదటిసారి.
పూంఛ్ జిల్లాలోనే ప్రఖ్యాత బుద్ధ అమర్ నాథ్ దేవాలయానికి వెళుతోన్న యాత్రికులపై ముగ్గురు ముష్కరులు గ్రేనేడ్లు విసిరారు. శనివారం జరిగిన ఈ సంఘటనలో 11 మంది యాత్రికులు గాయపడ్డారు. వారందరినీ జమ్ములోని ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. బాంబులు వరిసిన ముగ్గురు యువకుల్లో ఇద్దరిని జనం పట్టుకుని పోలీసులకు అప్పగించగా, మరొకడు పరారయ్యాడని పోలీసులు చెప్పారు.
ఇటు ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో కమిషనర్ అబ్దుల్ బాసిత్ పాక్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కశ్మీర్ కీ ఆజాదీ (కశ్మీర్ స్వాతంత్ర్యం) నేపథ్యంలో ఈ ఏటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామంటూనే ఆయన కశ్మీర్ స్వాతంత్ర్యంపై మాట్లాడటం గమనార్హం. ఇదిలాఉంటే ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని సరిహద్దుల్లోని కీలక చెక్ పోస్టుల వద్ద పాక్ బలగాలు.. భారత బగాలకు మిఠాయిలు పంచిపెట్టాయి.