'ఇండియానే ఉల్లంఘించింది'
ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి భారత దేశమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఐక్యరాజ్యసమితికి పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది. భారత్ కాల్పులపై దర్యాప్తు జరిపించాలని పాక్ ఆర్మీ కోరుతూ ఐక్యరాజ్యసమితికి చెందిన భారత్, పాకిస్తాన్‌లలోని సైనిక పరిశీలకుల బృందానికి (యూఎన్‌ఎంజీఐపీ)కి శుక్రవారం ఫిర్యాదు చేసింది.
‘కాల్పుల్లో మా దేశస్థులు నలుగురు చనిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి సరిహద్దులోని ప్రజలపై భారత సైన్యం భారీ మోర్టార్లు, మెషిన్ గన్లు ప్రయోగించింది' అని పేర్కొంది. తమ సరిహద్దు గ్రామాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపిందని భారత్ చెప్పిన నేపథ్యంలో పాక్ ఈ ఫిర్యాదు చేసింది. 1949 నుంచి భారత్, పాక్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ అంశాన్ని యూఎన్‌ఎంజీఐపీ పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.