పాక్ ఆంక్షలతో భారత్ విమానాలకు దెబ్బ!
న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడుల నేపథ్యంలో భారత్ నిర్వహించిన సర్జికల్ దాడుల ప్రభావం దేశంలోని వాణిజ్య విమానాలపై పడింది. దాయాది పాకిస్థాన్ తన గగనతలంలో తక్కువ ఎత్తులో విమాన ప్రయాణాలను నిషేధించింది. దీంతో అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలకు భారత్ నుంచి వెళ్లే విమానాలు రూటు (మార్గం) మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
లాహోర్ మీదుగా వెళ్లే విమానాలు లాహోర్ దాటుతున్నప్పుడు 29వేల అడుగుల కన్న ఎక్కువ ఎత్తులో ప్రయాణించాలంటూ పాక్ ఏవిషయేషన్ అధికారులు తాజాగా నోటమ్ (వైమానిక సిబ్బందికి నోట్) జారీచేశారు. అక్టోబర్ నెలంతా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. గత సోమవారం కరాచీ నగరం విషయంలోనూ పాక్ ఇలాంటి ఉత్తర్వులు జారీచేసింది. కరాచీ మీదుగా వెళ్లే విమానాలు 33వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుందని ఆంక్షలు విధించింది. తక్కువ ఎత్తులో వెళ్లే గగనతల మార్గాన్ని పాక్ తన యుద్ధ విమానాల కోసం రిజర్వు చేసినట్టు కథనాలు వచ్చాయి.
పాక్ తాజా ఆంక్షల నేపథ్యంలో భారత్ విమానాలు సురక్షితంగా ప్రయాణించేందుకు సుదూర మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుందని, దీంతో దేశం నుంచి వెళ్లే విమానాలు ఆలస్యమయ్యే అవకాశముందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఇంటర్నేషనరల్ ఎయిర్‌లైన్స్ మాత్రమే భారత్-పాక్ మధ్య విమానాలు నడుపుతున్నది.