పాకిస్థాన్‌కు షాకిచ్చిన కొరియా | Pakistan-South Korea relations hit | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌కు షాకిచ్చిన కొరియా

Published Thu, Aug 10 2017 10:35 AM | Last Updated on Sat, Sep 16 2017 4:19 PM

పాకిస్థాన్‌కు షాకిచ్చిన కొరియా

పాకిస్థాన్‌కు షాకిచ్చిన కొరియా

  • పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పెట్టుబడులకు నో
  • దారుణంగా దెబ్బతిన్న దౌత్యసంబంధాలు

  • సియోల్‌: అంతర్జాతీయ సంస్థలు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు దేశంలోకి రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పాక్‌ ఆక్రమణలో ఉన్న కశ్మీర్‌, గిల్గిత్‌-బాల్టిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి తాజాగా దక్షిణకొరియా నిరాకరించింది. ఈ ప్రాంతంలో చేపట్టే ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించడానికి గతంలో ఆసక్తిచూపిన కొరియా.. వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టలేమంటూ ఇప్పుడు చేతులెత్తేసింది.

    గిల్గిట్‌-బాల్టిస్తాన్‌, ఆజాద్‌ కశ్మీర్‌ వివాదాస్పద ప్రాంతాలు కావడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అనేక చట్టపరమైన సంక్లిష్టతలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాలు వివాదాస్పదమే కాకుండా.. ఇవి అధికారికంగా పాకిస్థాన్‌ రాజ్యంలో చేరలేదు. దీంతో ఇక్కడ నివసించే ప్రజల పౌరసత్వం మొదలు అనేక విషయాల్లో సంక్లిష్టతలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతాలు తమవేనని భారత్‌ స్పష్టం చేస్తూ వస్తున్నది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా చేపట్టిన చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక కారిడార్‌ (సీపీఈసీ)పై సైతం భారత్‌ చాలా విస్పష్టంగా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సీపీఈసీకి భారత్‌ అభ్యంతరంతో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడంపై ఇన్వెస్టర్లు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు.

    ముజఫరాబాద్‌లోని జీలం నదిపై 500 మెగావాట్ల చకోతి హతియన్‌ హైడ్రో ప్రాజెక్టు అభివృద్ధికి ఆర్థిక సాయం అందజేయడానికి దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థ అయిన డీలిమ్‌ ఇండస్ట్రీయల్‌ కంపెనీ లిమిటెడ్‌ గతంలో ముందుకొచ్చినప్పటికీ.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడంపై పునరాలోచన చేస్తోంది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌, కొరియా ఎగ్జిమ్‌ బ్యాంకు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించాయి. ఈ నేపథ్యంలో డీలిమ్‌ సైతం వెనుకాడుతోంది. కొరియా ఆర్థిక సహకారంతో పీవోకేలో చేపట్టిన కోహలా జలవిద్యుత్‌ ప్రాజెక్టు కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది.

    ఈ ప్రాజెక్టుల నుంచి దక్షిణ కొరియా వెనుకకు తగ్గడంతో ఆ దేశంతో పాక్‌ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌లో ఉన్న దక్షిణ కొరియా వాసులపై వేధింపుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ ఈ విషయంలో దక్షిణకొరియా ఏమాత్రం తగ్గడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement