పాక్ ఆర్మీ కాల్పుల్లో ధ్వంసమైన వ్యాన్
జమ్మూ: ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా పాకిస్థాన్ వైఖరిలో మార్పు రావడం లేదు. దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. 'హద్దు' మీరి కవ్వింపులకు పాల్పడుతోంది. సరిహద్దు వెంబడి కాల్పులు కొనసాగిస్తూనే ఉంది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలోని సాజియాన్, మండీ సెక్టార్లపై పాకిస్థాన్ బలగాలు కాల్పులకు దిగాయి.
ఆదివారం రాత్రి 8 గంటల నుంచి కాల్పులు అర్ధరాత్రి ఒంటి గంట వరకు కాల్పులు సాగించిందని భారత రక్షణశాఖ ప్రతినిధి కల్నల్ మనీష్ మెహతా తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. 120, 80 ఎంఎం మోర్టార్లు, భారీ మెషీన్ గన్లతో దాడికి దిగిందని వెల్లడించారు. పాక్ బలగాల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. మన సైనికులు ఎవరూ గాయపడలేదని చెప్పారు.
సరిహద్దు వెంబడి శని, ఆదివారాల్లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు భారత పౌరులు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా, పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) అనిల్ వాధ్వా.. ఆదివారం ఢిల్లీలోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించుకుని తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేశారు.