ఐరాసలో ‘కశ్మీర్’ను లేవనెత్తిన షరీఫ్
న్యూయార్క్: అనుకున్నట్లే జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు, ఎన్ఎస్ఏ స్థాయి చర్చలకు వెనుకబాటు తదితర అంశాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ అంతర్జాతీయ వేదికపై మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో మాట్లాడిన ఆయన.. కశ్మీర్ సమస్య పరిష్కారానికి 4 సూత్రాల శాంతి ఫార్మూలాను ప్రతిపాదించారు.
- కశ్మీర్‌ను సైన్యరహితం చేయడం
- సియాచిన్ నుంచి బేషరతుగా సైనిక దళాలను ఉపసంహరించడం
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరుదేశాలు దళాలను ఉపయోగించడం కానీ, ఉపయోగిస్తామని బెదిరించడం కానీ చేయకపోవడం
- 2003నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం
పై నాలుగు సూత్రాలు అమలు చేస్తే అణ్వస్త్ర దేశాలైన పాక్, భారత్‌ల మధ్య శాంతియుత సంబంధాలు నెలకొంటాయని షరీఫ్ వక్కాణించారు.
సంబంధాలను సంఘర్షణతో కాకుండా సహకారంతో మాత్రమే నిర్వచించుకోవాలన్న షరీఫ్.. కశ్మీర్ అంశంపై తీర్మానాన్ని అమలు చేయకపోవడం ఐక్యరాజ్యసమితి వైఫల్యమని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్య పరిష్కార ప్రక్రియలో కశ్మీరీలనూ భాగస్వామ్యులను చేయాలని తేల్చిచెప్పారు.