పాలమూరు పరిహారంలో.. ‘తోడేళ్ల ’ ఫలహారం! | palamuru - Rangareddy lift irrigation scheme | Sakshi
Sakshi News home page

పాలమూరు పరిహారంలో.. ‘తోడేళ్ల ’ ఫలహారం!

Published Mon, Jan 18 2016 2:07 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM

పాలమూరు పరిహారంలో.. ‘తోడేళ్ల ’ ఫలహారం! - Sakshi

పాలమూరు పరిహారంలో.. ‘తోడేళ్ల ’ ఫలహారం!

* పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూపరిహారంలో భారీగా అక్రమాలు
* భూమి రకం గుర్తింపు, విలువ మదింపులో రెవెన్యూ అధికారులు, దళారుల హస్తలాఘవం
* రెండేసి పంటలు పండుతున్నట్లు నకిలీ రికార్డులు
* రక్షిత కౌలుదారు రికార్డులను దాచి కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు
* అక్రమాలపై ఇంటలిజెన్స్ నిఘా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూపరిహారం చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకముందే భూపరిహారం మదింపు, చెల్లింపులో కోట్ల రూపాయలు పక్కదారి పడుతున్నాయి. ముంపు గ్రామాల్లో ఇష్టారీతిన భూముల వర్గీకరణతో అధికారులు అడ్డగోలుగా దండుకుంటున్నారు. దళారుల అవతారమెత్తిన స్థానిక నేతలు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి... బీడు భూముల్లో రెండేసి పంటలు పండుతున్నట్లు, అసలు బోరుబావి కనెక్షనే లేనిచోట్ల పదుల ఎకరాల్లో నీరు పారుతున్నట్లు, పది అడుగులు కూడా లేని గుంతలను బోరు బావులుగా చూపిస్తూ తప్పుడు రికార్డులు సృష్టించి కోట్లు మింగేస్తున్నారు.

అసలు రక్షిత కౌలుదారు చట్టం రికార్డులను దాచిపెట్టి మరీ అర్హులకు అందాల్సిన పరిహారాన్ని స్వాహా చేస్తున్నారు. ఇలా ఒక్క కర్వెన రిజర్వాయర్ ముంపు గ్రామాల్లోనే రూ. 50 కోట్లకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు అంచనా. ఈ అవకతవకలను వెలుగులోకి తెచ్చేందుకు పోలీసు ఇంటెలిజెన్స్ విభా గం రంగంలోకి దిగి వివరాలను సేకరించింది.
 
ఇప్పటికే రూ.300 కోట్ల పరిహారం చెల్లింపు
పాలమూరు ప్రాజెక్టులో భాగంగా అనంతగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ(కర్వెన), ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా మిగతా ఐదు రిజర్వాయర్ల పరిధిలో 20,884.86 ఎకరాల భూమి సేకరించాలని అధికారులు గుర్తించారు. అందులో 15,889.99 ఎకరాలు పట్టా భూమికాగా.. మిగతాది ప్రభుత్వ భూమి. పట్టాభూముల్లో ఇప్పటికే 15 వేల ఎకరాల వరకు ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 123 ప్రకారం ఈ ప్రాజెక్టు కింద భూసేకరణ జరుగుతోంది.

ఏటా రెండు పంటలు పండే భూములకు ఎకరాకు రూ. 5.5 లక్షలు, ఒక పంట పండే భూమికి రూ. 4.5 లక్షలు, బీడు భూములకు రూ. 3.5 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. ఇక చెట్లు, స్థలాలు, వ్యవసాయ బావులు ఇతర నిర్మాణాలు వంటివేమున్నా వాటికి ప్రభుత్వం నిర్ధారించిన రేట్లతో పరి హారం చెల్లిస్తారు. భూములకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 390 కోట్లు విడుదల చేయగా... అందులో రూ. 300.26 కోట్ల వరకు పరిహారం చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే భూముల రకాన్ని మదింపు చేసే విషయంలో, బోరు బావులు, బోర్లను గుర్తించి వాటికి రేటు నిర్ధారణ చేయడంలో అక్రమాలు జరుగుతున్నాయి.
 
నీళ్లు రాని బోర్లకూ పరిహారం
కర్వెన రిజర్వాయర్ పరిధిలో భూత్పూర్ మండల పరిధిలోని కర్వెన, తాటిపర్తి, కొత్తూరు, ఎల్కిచర్ల గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ నాలుగింటిలో కలిపి  3,561 ఎకరాల ముంపు భూమి ఉండగా, అందులో పట్టా భూములు 3,285.5 ఎకరాలు. ఒక్కో గ్రామ పరిధికి సంబంధించి భూమిని మూడు విడతలుగా కలెక్టర్ ఆమోదానికి పంపుతున్నారు. ఇందులో కర్వెన గ్రామానికి సంబంధించి తొలి విడతలో 275 ఎకరాలను పంపగా... అందులో 80 ఎకరాలు రెండు పంటలు, 43 ఎకరాలు ఒక పంట భూములను చూపారు.

రెండో విడతలో 152 ఎకరాల బీడు భూములను చూపారు. మూడో విడతలో 133 ఎకరాల వివరాలు పంపగా... అందులో 40 ఎకరాలు రెండు పంటల భూమి, 35 ఎకరాలు ఒక పంట భూమి, 59 ఎకరాలు బీడుగా చూపించారు. ఇక్కడ బీడు భూములు, ఒక పంట పండే భూములను రెండేసి పంటలు పండే భూములుగా చూపి లెక్కలు కట్టారు. ఇలా లెక్క కట్టేందుకు రెవెన్యూ అధికారులు దళారుల సహాయంతో లబ్ధిదారుల వద్ద ఎకరాకు రూ. 50వేల చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండు పంటల భూమిగా అర్హత ఉండాలంటే ఒక బోరు కింద మూడెకరాలు మాత్రమే ఉండాలి.

కానీ కర్వెన గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకుడికి చెందిన సర్వే నంబర్లుగా భావిస్తున్న 144, 145, 133, 156, 235, 244ల కింద మొత్తంగా 40 ఎకరాలను రెండు పంటల భూమిగా చూపారు. కానీ ఈ భూముల్లో ఒక పంట మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. సర్వే నంబర్లు 169, 170, 190, 191, 192, 193లలో మొత్తంగా 70 ఎకరాల వరకు భూమి ఉండగా... ఇక్కడ 13 బోర్లు, 3 బోరుబావులు ఉన్నాయని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ విద్యుత్ శాఖ రికార్డుల ప్రకారం మూడు బోరుబావులు మాత్రమే ఉన్నాయి.

ప్రభుత్వ లెక్కల ఆధారంగా చూసినా... బోరుకు 3 ఎకరాల చొప్పున 39 ఎకరాలకు మించి సాగు ఉండదు. అయినా ఈ 70 ఎకరాలనూ రెండు పంటల భూమిగా లెక్కించారు. వాస్తవానికి ఇక్కడ బోర్లకు విద్యుత్ కనెక్షన్‌లు లేకుండానే, అసలు బోరు వేయకుండానే నడుస్తున్నట్లుగా అధికారులు లెక్కగట్టారు. గతంలో బోర్లు వేసి నీరుపడని వాటిల్లో కూడా ఒక పైపు మాత్రం ఏర్పాటు చేసి.. బోర్లు ఉన్నట్లుగా నిర్ధారించి పరిహారం లెక్కించారు. ఇంకొన్ని చోట్ల అసలు బోరే లేకున్నా... 10 అడుగుల మేర తవ్వి అందులో పైపులు దించి బోరు ఉందన్నట్లుగా సృష్టించారు.
 
అక్రమాలకు పరాకాష్ట
కర్వెనలో సర్వే నంబర్ 246లో ఎకరా 2 గుంటల భూమి, 247లో రెండెకరాల 20 గుంటలు, 248లో రెండెకరాల ఆరు గుంటల భూమి ఉంది. ఇదంతా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిదే. ఇందులో సర్వే నంబర్ 246లోని భూమిలో 22 గుంటలు,  247లోని రెండెకరాల 20 గుంటలు, 248లోని రెండెకరాల 3 గుంటల భూమిని దళితులకు భూపంపిణీ పథకం కోసం ఆ నాయకుడు ఎస్సీ కార్పొరేషన్‌కు అమ్మేశారు.

ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్ డబ్బు చెల్లిస్తూ గెజిట్‌ను సైతం విడుదల చేసింది. ఆ భూమిని స్వాధీనం చేసుకుని.. అదే గ్రామంలోని దళితులకు పంపిణీ చేసి పాస్‌బుక్‌లు సైతం అందజేసింది. కానీ సదరు నాయకుడు పంపిణీ చేసిన ఈ భూమిపై తిరిగి పాస్‌బుక్కులు సృష్టించి, రూ. 9.88 లక్షలు పరిహారం కింద పొందారు. ఇక ఎల్కిచర్ల పరిధిలోని సర్వే నంబర్ 378లో ఎనిమిది ఎకరాలను 2 పంటల భూమిగా లెక్కించారు.

ఇక్కడ ఇంటలిజెన్స్ విచారణ చేయగా... కేవలం రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారని, మిగతాది బీడు భూమి అని తేలింది. ఇక సర్వే నంబర్ 373లో 11 ఎకరాలు 2 పంటల భూమిగా చూపగా... అక్కడ అసలు పంటలే లేవు. ఇలా ఇష్టారీతిన మదింపు చేస్తూ అధికారులు భూత్పూర్ మండల పరిధిలోనే సుమారు రూ. 50 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. భూత్పూర్ మండల పరిధిలో ఇంకా చాలానే అవకతవకలు జరిగినట్లుగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement