రాజమండ్రి తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి విలేకరుల అడిగిన కొన్ని ప్రశ్నలకు ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి దాటవేశారు.
రాజమండ్రి: రాజమండ్రి తొక్కిసలాట దుర్ఘటనకు సంబంధించి విలేకరుల అడిగిన కొన్ని ప్రశ్నలకు ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి దాటవేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అడగాల్సిన ప్రశ్నలను తనను అడుగుతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎలాగూ అందబాటులోకి వస్తారని ఆ ప్రశ్నలను ఆయననే అడగాలని చెప్పారు.
బుధవారం రాజమండ్రిలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశానంతరం పల్లె మీడియాతో మాట్లాడారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. రాజమండ్రి తొక్కిసలాట ఘటనపై వీలైనంత త్వరగా విచారణ జరిపిస్తామని తెలిపారు. 27 మంది మరణించడాన్ని చిన్న విషయంగా చూడటం లేదని చెప్పారు. చంద్రబాబు రాత్రి పగలు ఈ విషయం గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించే అవకాశముందని వెల్లడించారు. ఇక విశాఖపట్నంలో యూనిటెక్కు కేటాయించిన 1400 ఎకరాలను భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుంటున్నట్టు పల్లె చెప్పారు. ఈ భూమిని ఐటీ, ఇతర పరిశ్రమల కోసం ఇవ్వనున్నట్టు చెప్పారు.