పండిట్లకు టౌన్‌షిప్‌లపై ఆందోళనలు
* జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల నిరసన
* అడ్డుకున్న భద్రతాదళాలు..
* యాసిన్ మాలిక్ అరెస్ట్
జమ్మూ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పండిట్లకు ప్రత్యేక ఆవాసాల ఏర్పాటు యత్నాలను నిరసిస్తూ.. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) ఆధ్వర్యంలో వేర్పాటువాదులు శుక్రవారం శ్రీనగర్‌లో ఆందోళన చేపట్టారు. ఆందోళనను భద్రతా దళాలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జేకేఎల్‌ఎఫ్ నేత యాసిన్‌మాలిక్ సహా పలువురిని అరెస్టు చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. వేర్పాటువాదులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు లాఠీచార్జి చేయడం, బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో 24 మంది గాయపడ్డారు. ఆందోళనలో పలువురు కశ్మీరీ పండిట్లు పాల్గొనడం గమనార్హం. తమకు ప్రత్యేక టౌన్‌షిప్‌లు అవసరం లేదని విషన్‌జీ అనే పండిట్ చెప్పారు. యాసిన్‌మాలిక్ ఆధ్వర్యంలో వేర్పాటువాదులు తొలుత శ్రీనగర్‌లోని మైసుమా నుంచి నగరం మధ్యలోని లాల్‌చౌక్‌కు ర్యాలీగా బయలుదేరారు. మధ్యలోనే అడ్డుకున్న భద్రతా దళాలు.. మాలిక్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.