ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడి
ఇస్లామాబాద్: ఇరాన్ బుధవారం జరిపిన దాడులకు గురువారం పాక్ ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దులకు సమీపంలోని ఇరాన్ సియెస్తాన్–బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు జరిపింది. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో చేపట్టిన ‘ప్రెసిషన్ మిలటరీ స్ట్రయిక్స్’లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్లకు చెందిన 9 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం ఉందని పాక్ ఆర్మీ వెల్లడించింది.
ఈ ఘటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌కు తమ నిరసన తెలిపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్ దాడుల్లో ఇరానేతర జాతీయులైన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు చనిపోయినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. పాక్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్–అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో బుధవారం విరుచుకుపడింది.
ఈ దాడులకు నిరసనగా పాక్ తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించడంతోపాటు ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంపై ఇరాన్ దాడులను భారత్ సమర్థించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్న తమ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేసింది. ఇది ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయమే అయినప్పటికీ, దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకునే చర్యలను భారత్ అర్థం చేసుకుందని పేర్కొంది.