వేధించే సంతానాన్ని వెళ్లగొట్టవచ్చు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: తమను వేధించే సంతానాన్ని ఆ తల్లిదండ్రులు ఇంటి నుంచి పంపించివేయవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వారు నివసిస్తున్న ఇల్లు సొంతమా, అద్దెదా అనే విషయం పట్టించుకోనక్కరలేదంది. ఇంటిపై తల్లిదండ్రులకు న్యాయపర హక్కులు ఉన్నంత వరకూ వారిని వేధించే వయోజనులైన పిల్లలను ఆ ఇంటి నుంచి పంపొచ్చని పేర్కొంది. తల్లిదండ్రుల ఇంటి నుంచి తమను వెళ్లగొట్టాలని 2015లో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తాగుబోతు అయిన మాజీ పోలీసు, అతని సోదరుడు వేసిన పిటిషన్ పై ఈ తీర్పిచ్చింది.
తాము మెయింటెనెన్స్ కోసం డబ్బు కోరకపోయినా.. కేవలం శారీరకంగా వేధించామనే ఆరోపణలపైనే ట్రిబ్యునల్ తీర్పు వెలువరించిందని ఆ సోదరులు కోర్టులో వాదించారు. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ చట్టం–2007ను ట్రిబ్యునల్ అతిక్రమించిందని తెలిపారు. కోర్టు స్పందిస్తూ.. వృద్ధులు తమ ఇంటిలో ప్రశాంతంగా జీవించే హక్కును కల్పించడానికి.. శారీరకంగా, మానసికంగా వేధించే సంతానాన్ని ఇంటినుంచి వెళ్లగొట్టే ఆదేశాలు ట్రిబ్యునల్ ఇవ్వవచ్చని పేర్కొంది.