వచ్చే నెల నుంచి కొన్ని ఏటిఎంల పాక్షిక మూసివేత
ముంబై: భద్రతా కారణాల రీత్యా దేశంలోని కొన్ని ఏటిఎంలను రాత్రి పూట పాక్షికంగా మూసివేయడానికి బ్యాంకులు సిద్ధపడ్డాయి. ఇటీవల జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఏ)సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏటిఎంలకు తగిన భద్రత కల్పించలేమని బ్యాంకులు తెలిపాయి. దాంతో వచ్చే నెల నుంచి వినియోగదారులు తక్కువగా ఉపయోగించే కొన్ని ఏటిఎంలను రాత్రి పూట మాత్రమే మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐబిఏ రిజర్వు బ్యాంకుకు లేఖ రాసింది.
బెంగళూరులోని ఏటిఎంలో ఒక మహిళపై దాడి జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఐబిఏ ఈ సమావేశం నిర్వహించింది. వినియోగం తక్కువగా ఉన్న ఏటిఎంలకు భద్రత కల్పించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా బ్యాంకులు భావిస్తున్నాయి. అందువల్ల కొన్ని ఏటిఎంలను రాత్రి పూట మూసివేయాలనుకుంటున్నారు. అటువంటి ఏటిఎంలను గుర్తించాలని నిర్ణయించారు. ఏటిఎంల విషయంలో వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని చర్చించారు. సిసిటివిల ద్వారా పర్యవేక్షించాలని కొందరు సలహా ఇచ్చారు. ఒకేచోట రెండు మూడు బ్యాంకుల ఏటిఎంలు ఎన్నట్లయితే ఆ బ్యాంకులు ఉమ్మడిగా ఒక గార్డును నియమించే విషయం కూడా చర్చించారు.
ఏటిఎంల భద్రత, నిర్వహణ, గార్డుల నియామకం, పాక్షిక మూసివేతలకు సంబంధించి బ్యాంకులకు తాము కొన్ని సూచనలు చేశామని, వాటిని రిజర్వు బ్యాంకు కూడా అంగీకరించవలసి ఉందని ఐబిఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎంవి టంక్సాలే చెప్పారు. బ్యాంకులు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపారు. ఏటిఎంల వద్ద నేరాలను నిరోధించడానికి గార్డులు తప్పనిసరి అని మరో అధికారి చెప్పారు.