17 శాతం పెంచిన ఐబీఏ
2022 నవంబరు నుంచి అమలు
బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం పెంచాలని కొద్దిరోజులుగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబంధించి శుక్రవారం ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం వెలువడింది. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17% పెరగనుంది. ఇందుకు సంబంధించి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది.
తాజా నిర్ణయంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఏడాదికి అదనంగా రూ.12,449 కోట్లు ఖర్చు అవ్వనున్నట్లు తెలిసింది. ఈ వేతన పెంపు 2022 నవంబరు నుంచి అమలుకానుంది. దీంతో దాదాపు 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేసేలా, అన్ని శనివారాలను సెలవుగా గుర్తించడానికి ఆలిండియా బ్యాంక్స్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఒప్పుకుంది. ఇందుకు ప్రభుత్వ అనుమతి లభించాల్సి ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ తర్వాత సవరించిన పనిగంటలు అమల్లోకి వస్తాయి.
కొత్త డీఏ పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను రూపొందించారు. దీని ప్రకారం.. మహిళా ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్ సమర్పించకుండానే నెలకు ఒక సిక్ లీవ్ తీసుకునే సౌలభ్యం ఉంది. ఉద్యోగి రిటైర్‌మెంట్ సమయంలో 255 రోజుల వరకు ప్రివిలేజ్డ్ లీవ్‌లను నగదుగా మార్చుకోవచ్చు. విధుల్లో మరణించినా, ఈ మొత్తం సంబంధీకులకు చెల్లిస్తారు.
ఇదీ చదవండి: ‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, పెన్షన్/ఫ్యామిలీ పెన్షన్‌తో పాటు నెలవారీ ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. 2022 అక్టోబరు 31న, అంతకుముందు పెన్షన్ అందుకునేందుకు అర్హత ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment