వెంటాడి.. కాల్చి చంపారు..
పట్నా: బిహార్‌లో ఓ బీజేపీ నేతను వెంటాడి మరీ కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. రాజధాని పట్నా నడిబొడ్డున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బీజేపీ పట్నా యూనిట్ ప్రధాన కార్యదర్శి అవినాశ్ కుమార్ గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో తన నివాసానికి సమీపంలో మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. దాద్దాలీ రోడ్డు సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తున్న ఆయనపై ముగ్గురు దుండగులు దాడి చేశారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు అవినాశ్ ప్రయత్నించగా.. వెనుక నుంచి దుండగులు కాల్పులు జరపడంతో ఆయన కుప్పకూలిపోయారు. ఒక దుండగుడు ఆయన వద్దకు వచ్చి తుపాకీతో తలపై కాల్పులు జరపడంతో అవినాశ్ అక్కడికక్కడే మృతిచెందారు.
అనంతరం ముగ్గురు నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఈ హత్యోదంతం మొత్తం దగ్గరలో ఉన్న ఆలయం వద్ద గల సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. వీటి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుల కోసం పట్నా నగరం మొత్తం జల్లెడపడుతున్నారు.