అనకొండ మింగితే ఎలాగుంటుంది?
అనకొండ.. చాలా మంది ఆ సినిమాను చూశారు.. ఆ పాము అమాంతం మనుషులను మింగేయడమూ చూశారు.. అయితే.. అది సినిమా.. మరి నిజంగా అది జరిగితేనో.. చిత్రంలో ఉన్న వ్యక్తి ఆ పనే చేయబోతున్నాడు. అమెజాన్ అడవుల్లోకి పోయి.. తనకు తానుగా ఆనకొండకు ఆహారమవబోతున్నాడు. ఇతడి పేరు పాల్ రోసోలీ(26). అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన పాల్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్. ప్రపంచంలోనే అత్యంత భారీ పాముగా పేరొందిన అనకొండ మనల్ని మింగేస్తే ఎలాగుంటుంది? అన్న విషయాన్ని తెలుసుకోవడానికే పాల్ ఈ సాహసానికి సిద్ధమయ్యాడు.
ఎలాగుంటుందో తెలియాలంటే.. అనకొండ మింగిన తర్వాత పాల్ బతికుండాలి కదా.. అందుకే తన కోసం ప్రత్యేకంగా స్నేక్ ప్రూఫ్ సూట్ తయారుచేయించుకున్నాడు. ‘ఈటెన్ ఎలైవ్’ పేరిట రూపొందించిన ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 7న డిస్కవరీ చానల్ ప్రసారం చేయనుంది. ఈ విషయంపై వన్యప్రాణి ప్రేమికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది జంతువులను తీవ్రంగా హింసించడం కిందకే వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదంటూ చానల్‌ను కోరుతున్నారు. ఈ కార్యక్రమం ప్రోమోల్లో పచ్చ అనకొండాను చూపించారని.. ఆ అనకొండాకు మనిషిని పూర్తిగా మింగే సామర్థ్యం లేదని అంటున్నారు. ఇలాంటి వాటి వల్ల ఆ అనకొండ ప్రాణాలకూ ప్రమాదమేనని చెబుతున్నారు.