అప్పుడు మిగతా ఎంపీలు ఏమయ్యారు?
ట్వీటర్‌లో పవన్ కల్యాణ్ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీమాంధ్ర ఎంపీలపై మాటల దాడిని కొనసాగించారు. ఇటీవల పవన్ చేసిన విమర్శలపై పలువురు టీడీపీ ఎంపీలు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. దానిపై ఆయన ట్వీటర్‌లో స్పందిస్తూ సీమాంధ్ర ఎంపీలు తమ పౌరుషాన్ని కేంద్రంపై చూపాలన్నారు. తాజాగా గురువారం ఎంపీలపై విమర్శలను కొనసాగించారు.
‘‘గత మార్చి 17న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి తెచ్చిన సవరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగినప్పుడు ఎంతమంది సీమాంధ్ర ఎంపీలు హాజరయ్యారు? నాకున్న సమాచారం మేరకు ఈ చర్చలో అయిదుగురు ఎంపీలే పాల్గొన్నారు. మిగతా ఎంపీలు ఎక్కడికెళ్లారు?’’ అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఎవరెవరు పాల్గొన్నారన్న విషయాన్ని చెప్పడానికి పవన్ తన ట్వీటర్‌లో పీఆర్‌ఎస్‌ఐ వెబ్‌సైట్‌కు సంబంధించిన లింక్‌ను ఇచ్చారు. అయితే అది పనిచేయడం లేదు.