సంపూర్ణ తెలంగాణ కోసం ఉద్యమిస్తాం
టీజేఏసీ చైర్మన్ కోదండరాం
హైదరాబాద్: హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరు సరిగా లేదని, ఉద్యోగుల పంపకంలో కూడా కేంద్రం చేసిన ప్రకటన నిరాశ పరిచిందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడాది కాలమైనా విభజన ప్రక్రియ పూర్తి కాలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంపూర్ణ తెలంగాణను సాధించే వరకు మరోసారి ఉద్యమాన్ని చేపడుతామన్నారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేత నుంచి వచ్చిన తెలంగాణకు కేంద్రం చేయూతను అందించాలన్నారు. విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పబ్లిక్ రంగ సంస్థల, ఉద్యోగుల పంపిణీ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఏడాదిలోగా పూర్తి కావాలని, కానీ అలా జరగలేదన్నారు. ఉద్యోగుల విభజనలో గిర్‌గ్లానీ నివేదికను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక మంత్రికి బాధ్యతను అప్పగించాలన్నారు.