విభజన వ్యతిరేక పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు దాఖలైన 12 పిటిషన్లు దేశ అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణకు స్వీకరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా, బలవంతంగా విభజిస్తోందని.. ఆ బిల్లును అడ్డుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 19న పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే ఈ విభజనపై స్టే ఇవ్వాలని విన్నవిస్తూ కేంద్ర న్యాయశాఖ, కేబినెట్ సచివాలయం, హోంశాఖలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
అలాగే మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాశ్, బీజేపీ నాయకుడు రఘురామకృష్ణంరాజులు కలిపి మరొక పిటిషన్ దాఖలు చేశారు. వీరితోపాటు మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, రాయపాటి సాంబశివరావు, సీఎం రమేశ్ తదితరులు కూడా విభజనపై పిటిషన్లు వేశారు. వీటిపై న్యాయమూర్తులు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం విచారించనుంది.