మనీలా: ప్రపంచంలోనే అతి చెత్త విమానాశ్రయం ఏదీ? అంటే ఫిలిప్పీన్స్ విమానాశ్రయమేనంటోంది ఓ ట్రావెల్ వెబ్‌సైట్ సర్వే! ఈ సైట్ నిర్వహించిన సర్వేలో వరుసగా రెండో ఏడాది ఫిలిప్పీన్స్ ఈ ‘అతి చెత్త’ స్థానంలో నిలిచింది. అయితే దేశాధికారులు మాత్రం ఆ వెబ్‌సైట్ ఫలితాలను తోసిపుచ్చుతున్నారు. విమానాశ్రయంలో తాము సౌకర్యాలను బాగానే మెరుగుపరిచామని అంటున్నారు. ‘ద గైడ్ టు స్లీపింగ్ ఇన్ ఎయిర్‌పోర్ట్స్’ వెబ్‌సైట్.. ఈ సర్వే చేసింది. సౌకర్యం, శుభ్రత, వినియోగదారునికి సేవలు, ఇతర ఏర్పాట్లపై ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిలిప్పీన్స్‌పై ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.
ఇక్కడి సౌకర్యాలు శిథిలావస్థలో ఉన్నాయని, విమానాశ్రయ సిబ్బంది ప్రత్యేకించి ట్యాక్సీ డ్రైవర్లు.. ప్రయాణికులకు గౌరవమే ఇవ్వరని, ఇక్కడ వెయిటింగ్ సమయం చాలా ఎక్కువని, అధికారులు కూడా చాలా మూర్ఖంగా ఉంటారని ప్రయాణికులు వెబ్‌సైట్‌లో అభిప్రాయపడ్డారు.