
కావాలనే స్టింగ్ ఆపరేషన్: చంద్రబాబు
న్యూఢిల్లీ: హైదరాబాద్ లో శాంత్రిభద్రతలు గవర్నర్ చేతిలో ఉండాలని కేంద్రాన్ని కోరామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 8, 9 అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందేవరకు సహాయం చేయాలని ప్రధాని మోదీని కోరినట్టు చెప్పారు. ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాలన్నారు. సాగర్ జలాల విషయంలో కేసీఆర్ కు తానే ఫోన్ చేశానని చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కావాలనే రాజకీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా రెండు ప్రభుత్వాలు ఒక రాజధానిలో ఉన్నాయన్నారు. ఎవరి పరిధిలో వారు పనిచేసుకోవాలని, అందుకే సెక్షన్ 8 పెట్టారని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అనైతిక దారిలో ఎమ్మెల్సీ సీట్లు గెలిచారన్నారు. కావాలనే స్టింగ్ ఆపరేషన్ చేశారని ఆరోపించారు. దీనికి ఏసీబీ స్టాంప్ వేశారన్నారు. ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఆ వివరాలను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలన్నారు. అలా కాకుండా మీడియాకు లీక్ చేశారని తెలిపారు. ఫోన్ టాపింగ్ అక్రమం, పెద్ద నేరం అన్నారు. ఫోన్ రికార్డింగ్ కూడా అక్రమన్నారు. దేశంలోకి అక్రమంగా వచ్చిన వస్తువులతో టాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడెక్కడో మాటలను అతికించారని, ఫ్యాబ్రికేట్ చేశారని అన్నారు.
ఆడియో ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు, అలాంటప్పుడు టాపింగ్ సాధ్యం కాదుకదా అని ప్రశ్నించిన విలేకరిపై చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. రాజకీయాల గురించి, అవినీతి గురించి మాట్లాడతావా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గులేదూ అంటూ ఊగిపోయారు. రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి అడిగినప్పుడు... తమ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి మంత్రులను చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదంటూ సమాధానం దాటవేశారు.
నామినేటెడ్ ఎమ్మెల్యేతో తాను మాట్లాడినట్టుగా బయటకు వచ్చిన ఆడియో టేపులపై మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఫోన్లు టాప్ చేశామని తెలంగాణ హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ పై విచారణ చేయాలని ప్రధాని మోదీకి చెప్పామన్నారు. ఉన్నతస్థాయి దర్యాప్తుతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చంద్రబాబు అన్నారు.