ముంబై/న్యూయార్క్: అటు అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్ కమోడిటీ డివిజన్‌లో ఇటు దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో శుక్రవారం చురుగ్గా ట్రేడవుతున్న బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. కడపటి సమాచారం అందేసరికి నెమైక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) బంగారం ధర 36 డాలర్ల నష్టంతో 1,333 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ఇక వెండి ధర కూడా 6 శాతం వరకూ నష్టంతో 22 డాలర్ల వద్ద ఉంది. ఇందుకు అనుగుణంగా ఎంసీఎక్స్‌లో కూడా బంగారం 10గ్రాముల ధర 2% నష్టంతో (రూ.613) రూ.29,931 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర రూ.2,421 (4.7%) నష్టంతో రూ.49,329 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతానికి అమెరికా ఫెడ్ సహాయ చర్యలను ఉపసంహరించనప్పటికీ, అక్టోబర్‌లో కోత ఉండవచ్చని ఫెడరల్ రిజర్వ్ అధికారి ఒకరు చేసిన కామెంట్ ఫ్యూచర్స్‌లో ధరల పతనానికి కారణమని విశ్లేషకులు చెప్పారు.