మోదీవి ఉత్తమాటలే: రాహుల్
బిహార్ ఎన్నికల సభలో ధ్వజం
- మహాత్మా గాంధీ పేదల కోసం సూటు, బూటు వదిలేశారు
- మోదీ ప్రధానమంత్రి కాగానే రూ. 15 లక్షల సూటు వేసుకున్నారు
రామ్‌నగర్ (బిహార్): ప్రధాని నరేంద్రమోదీ ఎంతసేపు మాటలు చెబుతారే తప్పితే చేసి చూపేదేమీ ఉండదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు... ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, పంటలకు మద్దతు ధరను 100 శాతం పెంచుతామని, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కితెచ్చి.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షల చొప్పున వేస్తామని చెప్పారు. ఇందులో ఒక్కటైనా జరిగిందా? అప్పుడైనా... ఇప్పుడైనా ఆయనవి ఉత్త మాటలే.
చేతల్లో చేసేదేమీ ఉండదు’ అని రాహుల్ విమర్శించారు. కేవలం కొంతమంది సూటు-బూటు వేసుకున్న మనుషుల బాగు కోసమే మోదీ పనిచేస్తున్నారన్నారు. ‘సూటు-బూటు బారిస్టర్ అయిన మహాత్మా గాంధీ.. పేదల కోసం వాటిని వదిలివేశారు. కానీ.. తాను టీ విక్రేతనని చెప్పుకునే మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత రూ. 15 లక్షల సూటు తొడుక్కున్నారు’ అని ఎద్దేవా చేశారు. రాహుల్ శనివారం బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని రామ్‌నగర్‌లో బహిరంగసభలో ప్రసంగించారు.
మోదీ లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన తరహాలో ఇప్పుడూ ఇస్తున్న బూటకపు హామీలకు మోసపోవద్దని సూచించారు. ‘ఎన్నికల్లో గెలిచిన తర్వాత సూటు, బూటు తొడుక్కునే ఆయన స్నేహితులు ఢిల్లీ, గుజరాత్‌ల నుంచి కొత్త భూసేకరణ బిల్లు కింద రైతుల భూమి తీసుకోవటానికి బిహార్‌కు వస్తారు.. వారి కోర్కెలను ఎన్‌డీఏ ప్రభుత్వం తీరుస్తుంది’ అని అన్నారు. ఉపాధి సృష్టి గురించి, పరిశుభ్రత గురించి సూటు, బూటు స్నేహితుల వద్ద గొప్పలు చెప్పుకోకుండా సఫాయి కార్మికుల వద్దకు, నిరుద్యోగ యువత వద్దకు వెళ్లాలన్నారు. ఈ సభలో పాల్గొన్న వారిలో ఎవరూ సూటు, బూటు వేసుకోలేదని చెప్తూ తమ కూటమి పేదల కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నిర్వహించిన ఈ సభకు జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్, ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ గైర్హాజరయ్యారు. అంతకుముందు పట్నా విమానాశ్రయంలో రాహుల్‌ను నితీశ్ కలిశారు.
ఎయిర్ గన్‌తో వచ్చిన యువకుడు, అరెస్ట్
రాహుల్ సభ వద్దకు ఎయిర్ గన్‌తో వచ్చిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.. అతడి వద్ద నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. రాహుల్ రాకముందే.. ప్రధాన ద్వారం వద్ద ఈ యువకుడిని అదుపులోకి తీసుకున్నామని, అతడిని ఝార్ముహి గ్రామానికి చెందిన తయ్యబ్‌జాన్‌గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. స్వీయ రక్షణ కోసం ఆ తుపాకీ తెచ్చానని చెప్తున్నాడన్నారు.
బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: బిహార్‌లో 2010 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ సతీమణి రబ్రీదేవిని ఓడించిన జేడీయూ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.